ఓ సర్పంచ్ నయా ప్లాన్: ట్యాక్స్ కట్టు గిఫ్ట్ పట్టు

గ్రామ పంచాయతీలకు ప్రజలు చెల్లించే పన్నులే ఆదాయ వనరు. అయితే వ్యక్తిగత సమస్యలతో పాటు రకరకాల కారణాలతో చాలా మంది పన్నులు కట్టడం లేదు. అందుకే ట్యాక్స్ కట్టు.. గిఫ్ట్ పట్టు అంటున్నాడో సర్పంచ్. సకాలంలో పన్నులు చెల్లిస్తేనే, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, జరిమానాల బాధ కూడా తప్పుతుందని గ్రామస్తులను చైతన్యం చేస్తున్నాడు.

ఖమ్మం జిల్లా రఘనాధపాలెం మండలం వేపకుంట్లలో  ఏళ్ల నుంచి ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. పన్నులు కట్టాలని అధికారులు చెబుతున్నా…చాలా మంది వ్యక్తిగత కారణాలతో  పన్నులు కట్టడం లేదు.  ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోక గ్రామ అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు జరిమానాలు పేరుకుపోతున్నాయి. దీంతో పన్నులు కట్టేలా ప్రజలను చైతన్యం చేసేందుకు సర్పంచ్ శ్యాం సుందర్ కొత్తగా ఆలోచించారు. గ్రామ పంచాయతీ పాలక వర్గంతో చర్చించి, దాతల సహాయంతో పండుగల సందర్భాల్లో దుకాణాలు పెట్టే లక్కీ డ్రాను ప్రవేశపెట్టాడు. పన్ను కట్టు… బహుమతి పట్టు అంటూ ప్రచారం చేశారు.

మార్చి 30 లోగా ఇంటి పన్ను, పంపు పన్ను చెల్లించిన వారి పేర్లతో మార్చి 31న గ్రామ పంచాయతీ ఆఫీసులో లక్కీ డ్రా తీయనున్నారు. ఇందులో మొదటి బహుమతి రిఫ్రిజిరేటర్ కాగా, ఇస్త్రీ పెట్టె, కుక్కర్, కూల్ వ్యాటర్ క్యాన్ వంటి 10 ఇతర ఆకర్షణీయమైన బహుమతులున్నాయి. దీంతో తమకు ఏదైనా గిఫ్ట్ రాకపోతుందా అన్న ఆశతో ప్రజలు ఉత్సాహంగా పన్నులు కడ్తున్నారు.

పన్నుల వసూలు కోసం స్కీం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ శ్యాంసుందర్ ను చాలా మంది గ్రామస్తులు అభినందిస్తున్నారు. అయితే… వంద శాతం పన్నులు వసూలు చేసి, వేపకుంట్లను ఆదర్శగ్రామంగా నిలపడమే తన లక్ష్యమంటున్నాడు సర్పంచ్ శ్యాంసుందర్.

Latest Updates