కరోనాతో బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరి కన్నుమూత

ముంబై: బాలీవుడ్ లో కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా.. బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరి(77) కరోనా వైరస్ కారణంగా క‌న్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ గురువారం ఆయన చనిపోయారని అనిల్ సూరి సోదరుడు రాజీవ్ సూరి మీడియాకు వెల్లడించారు. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అనిల్ సూరిని చేర్చుకునేందుకు ముంబైలోని లీలావతి, హిందూజా ఆస్పత్రులు నిరాకరించాయని, దీంతో ఓ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా కరోనా సోకినట్లు నిర్ధారించారని చెప్పారు. రెండ్రోజుల్లోనే పరిస్థితి సీరియస్ అయి అనిల్ గురువారం రాత్రి చనిపోయారని, కరోనా ప్రొటోకాల్ ప్రకారం శుక్రవారం ఉదయం ఓషివారా శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. ఒక్క వారంలోనే తన అభిమాన దర్శకుడు బసు చటర్జీ, తన సోదరుడు అనిల్ సూరిలను కోల్పోవడం చాలాబాధాకరమని రాజీవ్ విచారం వ్యక్తం చేశారు. రాజ్ కుమార్, రేఖ నటించిన ‘కర్మయోగి’, హేమామాలిని, కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘రాజ్ తిలక్’ వంటి మల్టీ స్టారర్ సినిమాలను అనిస్ సూరి నిర్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Latest Updates