వయసు 91… పార్టీ గెలుపు కోసం రోజుకు 10 గంటల కృషి

హిమాచల్ ప్రదేశ్ లోని నాలుగు లోక్ సభ సీట్లలో పార్టీ గెలుపు కోసం 91 ఏళ్ల వయసులోనూ కాంగ్రెస్ నాయకురాలు విద్యాస్టోక్స్ విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. తనకన్నా సగం వయసున్న నేతలతో పోటీ పడుతున్నారు. పోలింగ్ దగ్గర పడడంతో (మే 19) ప్రతిరోజు కార్యకర్తలను కలిసి వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన విద్యా స్టోక్స్కు రాజకీయాల్లో క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా పని చేసినా ఒక్క రూపాయి కూడా ఆమె జీతం తీసుకోలేదు. ప్రజలకు సేవచేయడమే నాయకుల డ్యూటీ అని ఆమె గట్టిగా నమ్ముతారు.

1974లో భర్త చనిపోయాక ఆమెరాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు కూతుళ్లు అమెరికాలో ఉన్నారు. 40 ఏళ్లకుపైగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న విద్యాస్టోక్స్ ఏనాడూ పదవుల్నిఆశించలేదు. “పార్టీ అప్పగించిన అన్ని పనుల్ని చిత్తశుద్ధి,  నిజాయితీతో పూర్తి చేశా. రాష్ట్రమంతా పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తున్నా. రోజులో10 గంటలు ప్రజలతోనే ఉంటా. వాళ్లే నాకు బలం. నేను పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదు. పార్టీకి విధేయురాలిగానే ఉన్నా. పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. అయితే మరోసారి ప్రత్యక్షరాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదు. సమాజ సేవచేయాలని అనుకుంటున్నా. పార్టీ బలపడేందుకు పనిచేస్తా. ఊపిరి ఉన్నంతవరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా ” అని విద్యా అన్నారు. 2017 అసెంబ్లీఎన్నికల్లో ఆమె నామినేషన్ పత్రాల్ని రిజెక్ట్ చేశారు.

యాపిల్స్ ఎక్కువగా పండే థియోగ్, కుమర్సేన్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. యాపిల్స్ పై ఇంపోర్ట్ డ్యూటీ పెంచాలని డిమాండ్ చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. “చైనాతో పోటీ ఉన్నందున ఇంపోర్ట్ డ్యూటీ పెంచాలని కోరాం. అయినా కేంద్రం పట్టించుకోలేదు. యాపిల్ రైతులు ఇప్పడు తమ ఓటుతో మోడీకి సమాధానం చెబుతారు” అనిఅన్నారు. విద్యా స్టోక్స్ హాకీ ఇండియా ప్రెసిడెంట్ గానూ పని చేశారు.

Latest Updates