నల్లమలను కాపాడుకుందాం -విజయ దేవరకొండ

సేవ్ నల్లమల ఉద్యమానికి సినిమా హీరో విజయ్ దేవరకొండ గట్టిగా మద్దతు పలికారు. 20,000 ఎకరాల నల్లమల అడవికి నాశనమయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

“ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేశాం. మంచినీటి వనరులు కూడా తగ్గిపోతున్నాయి. గాలి, నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. మరికొన్ని వరదలతో నష్టపోతున్నాయి. ఒకదాని తర్వాత మరో వనరులను అన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్తున్నాం. పచ్చని నల్లమల అడవులపైనా మన కన్ను పడిందిప్పుడు. యురేనియం లాంటి పునరుత్పత్తి లేని వనరుల కోసం అడవులు నాశనం చేసుకుంటామా.. అంతగా అవసరమైతే.. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే.. సోలార్ ఎనర్జీని వినియోగం లోకి తెద్దాం…ప్రతి ఇంటి పై కప్పు మీద సోలార్ ప్లేట్స్ ఏర్పాటుచేయాలని చట్టాలు చేయండి.
స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు యురేనియం, ఎలక్ట్రిసిటీని ఏం చేసుకుంటాం..?
మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం.?

నల్లమలను కాపాడుకుందాం… మనకోసం, మన భవిష్యత్ కోసం..#SaveNallamala” అని ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ.

Latest Updates