కరోనాపై పోరుకు విజయ్​ దేవరకొండ రూ.1.30 కోట్లు సాయం

హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తనవంతుగా రూ.1.30 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తెలిపాడు. సోషల్ మీడియాలో రెండు కీలక ప్రకటనలు పోస్ట్ చేసిన విజయ్.. కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పాడు. మిగిలిన రూ.1.25 కోట్లను ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు వినియోగించనున్నట్లు పేర్కొన్నాడు. 2 వేల కుటుంబాల నిత్యావసరాలను భరించనున్నట్లు తెలిపాడు. అవసరం ఉన్న వాళ్లు ఫౌండేషన్ వెబ్ సైట్ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని, వెంటనే దగ్గర్లోని షాపుల్లో వారు తీసుకునే నిత్యావసరాలకు సరిపడా డబ్బులు చెల్లిస్తామన్నారు. ‘ఈ విపత్తుకు మనలో ఎవరూ సిద్ధంగా లేరు. కానీ మనం పోరాట యోధులం. దీని నుంచి మనం త్వరగా కోలుకుని బలంగా ముందుకెళ్లాలి. పోరాడేందుకు వెనుకాడని నా అద్భుతమైన టీమ్ తో కలసి నేను ఇక్కడే ఉన్నా. ఈ ఫండ్ తో వీలైనంత మందికి సాయం చేసేందుకు యత్నిస్తాం. మాకు మీ ప్రేమ, దయ, మద్దతు కావాలి. మీ అందరికీ నా ప్రేమను, బలాన్ని పంపుతున్నా’ అని విజయ్ పేర్కొన్నాడు. భవిష్యత్ అవసరాల కోసం తాను కోటి రూపాయలు పక్కన పెట్టానని.. కరోనా విపత్తు ముగిసిశాక ఆంధ్ర, తెలంగాణల్లోని వేలాది మంది యువతకు ఈ మొత్తంతో ఉపాధి కల్పిస్తానన్నాడు.

Latest Updates