అప్పు కట్టేస్తానంటే తీసుకోరేం: మోడీకి మాల్యా ప్రశ్న

బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పరారైన లిక్కర్ టైకూన్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. తాను డబ్బు కట్టేస్తానంటున్నా దానికి రెస్పాన్స్ లేదంటూ గురువారం వరుసగా ట్వీట్లు చేశారు.  తాను అప్పుగా తీసుకున్న మొత్తం కట్టేస్తానంటే, దాన్ని తీసుకోవాలని బ్యాంకులకు మోడీ ఎందుకు చెప్పడం లేదంటూ ప్రశ్నించారు.

ప్రధాని మోడీ నిన్న లోక్ సభలో చేసిన చివరి ప్రసంగంలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాల్యా ఇలా స్పందించారు. నరేంద్ర మోడీ చాలా మంచి స్పీకర్ అని, ఓ వ్యక్తి రూ.9 వేల కోట్లు కొట్టేశాడంటూ తన గురించి పరోక్షంగా ప్రస్తావించారని మాల్యా ట్వీట్ చేశారు. ఆయన అన్నది తన గురించేనని మీడియా కథనాల్లో రాశారని, దాని ఆధారంగానే స్పందిస్తున్నానని చెప్పారు.

కింగ్ ఫిషర్ తీసుకున్న అప్పు మొత్తాన్ని కట్టేందుకు తాను సిద్ధమని చెప్పినా, బ్యాంకులను ఆ డబ్బు తీసుకోవాలని ప్రధానమంత్రి ఎందుకు చెప్పడం లేదని మర్యాదపూర్వకంగా ప్రశ్నిస్తున్నానని మాల్యా అన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టుకు కూడా ఎప్పుడో చెప్పానన్నారు. బ్యాంకు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని చెప్పారు.

తాను సంపదనంతా దాచి, డబ్బు లేదని చెబుతున్నానని ఈడీ అంటోందని మీడియాలో చూశానన్నారు. అది అబద్ధమని, 14 వేల కోట్ల రూపాయల ఆస్తులను కోర్టు ముందు పెట్టానని, కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపుతున్నారని అన్నారు.

Latest Updates