ఆన్ లైన్ లో ‘విజయ’ ఉత్పత్తులు

హైదరాబాద్ , వెలుగు: ఏది కావాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ కొట్టేసే కాలమిది. దానికి తగినట్టే విజయా డెయిరీ కూడా తన తీరును మార్చుకుంది. పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమ్మకానికి పెడుతోంది. బిగ్ బాస్కెట్ , డెయిలీడాట్ కామ్ , సూపర్ డెయిలీ, ఫ్లిప్ కార్ట్​, అమెజాన్ నౌ వంటి ఆన్ లైన్ స్టోర్లలో వాటిని అందించేందుకు నిర్ణయించింది. పాలు, నెయ్యి, ఫ్లేవర్డ్​ మిల్క్​, దూద్ పేడ.. వంటి విజయ ఉత్పత్తులను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తున్నట్టు పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పారు.

అయితే, పాలు కావాలంటే మాత్రం ఓ రోజు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటదని డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఫ్లిప్ కార్ట్​లో ప్రస్తుతం విజయ నెయ్యి మాత్రమే లభిస్తోంది. మార్చి మొదటి వారం నుంచి అమెజాన్ నౌలో పాల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి. మజ్జిగ, లస్సీ, దూద్ పేడ వంటి వాటిని సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Latest Updates