హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ వంచించారు

రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. 2014 ఎన్నికలలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని చెప్పారు. జగిత్యాల జిల్లా దర్మపురిలో ఎన్నికల సభలో విజయశాంతి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాకారానికి కేసీఆర్ తో పాటు తాను కూడా పోరాడానని అన్నారు. రాష్ట్ర సాకారం కేసీఆర్ ఒక్కరి సొత్తు కాదని తెలిపారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్నాయని.. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. నోట్ల రద్దుచేసి మోడీ దేశప్రజల నడ్డివిరిచారని అన్నారు. విదేశాల్లోని నల్ల ధనం ఇంకా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ ను ప్రధానిని చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ప్రతీ వ్యక్తి ఖాతాలో 15లక్షలు వేస్తానన్న మోడీ ప్రజలను మోసం చేసారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారం చేపట్టితే రైతులకు రూ 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని హామీఇచ్చారు. దీంతో పాటు.. పేద వారి బ్యాంక్ ఖాతాలో నెలకు రూ 6 వేలు జమ చేస్తామని తెలిపారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే, మంత్రి పదవి త్యాగం చేసిన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ ను ఎంపీగా గెలిపించాలని హస్తం గుర్తుపై ఓటు వేయండని కోరారు.

Latest Updates