కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు

కరోనాకు భయపడి సీఎం కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫాంహౌస్‌లో దాక్కున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. కరోనా కేసులు తెలంగాణలో పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ భయపడి.. ఫాంహౌస్‌ నుంచే పరిపాలన చేస్తున్నారని ఆమె అన్నారు. ఒక సీఎం అయి ఉండి మీరే సిటీ వదిలి వెళ్లి జిల్లాలో మకాం వేస్తే.. మరి సిటీలో ఉన్న సామాన్య జనం ఎక్కడికి వెళ్లాలో తెలపాలని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వెంటనే నగరానికి వచ్చి ప్రభుత్వ చర్యలను నేరుగా పర్యవేక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సినీ నటి విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ యధావిధిగా..

‘తెలంగాణలో రోజుకొకటిగా కరోనా కేసుల పెరుగుదల నమోదు ప్రకటించబడుతూ ఉంది.హైదరాబాదులో ఈ సమస్య ఉంటుందని జిల్లాల్లో అంతగా ఉండదని ప్రకటించిన సీఎం దొరగారు తమ భద్రత దృష్ట్యా రాజధానిలోని తమ అధికార నివాసం ప్రగతిభవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ దగ్గర ఫాంహౌస్‌లో ఉంటున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు.

మరి రాజధాని నగరంలోని సామాన్యులు ఎక్కడికి వెళ్లి తమ ప్రాణాలు రక్షించుకోవాలో కెసిఆర్ గారు చెబితే బాగుంటుంది.

ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధానికి వచ్చి, అధికార యంత్రాంగానికి అందుబాటులో ఉంటూ… ప్రభుత్వ చర్యలను నేరుగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు’ అని ఆమె ట్వీట్ చేశారు.

Latest Updates