కోర్టు సంచలన తీర్పు..రేపిస్టుకు 20 ఏళ్ల జైలుశిక్ష

అమరావతి, వెలుగు: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి విజయవాడ స్పెషల్ కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండేళ్ల విచారణ తర్వాత కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. 2017 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో వైద్యం కోసం తల్లితోపాటు విజయవాడకు వచ్చింది. ఇబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి వెళ్లే క్రమంలో సమీప బంధువు సైకం కృష్ణారావు కలిశాడు. విజయవాడలో తెలిసిన వాళ్లెవరూ లేరని తమతో రావాలని తల్లీకూతురు కృష్ణారావును కోరారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కృష్ణారావు బాలికను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంత దూరం నడవలేవంటూ బాలిక తల్లిని ఆస్పత్రిలో ఒక చోట కూర్చోబెట్టాడు. బాలికను డాక్టర్ కు చూపించిన తర్వాత మాయమాటలు చెప్పి ఇబ్రహీంపట్నంలోని మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కడుపు నొప్పితో బాధపడుతూ జరిగిన ఘటనను తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి గ్రామస్తులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి ఆధారాలను స్పెషల్ కోర్టుకు సమర్పించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు సైకం కృష్ణారావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Latest Updates