కూర బాగాలేదని భర్త మందలించినందుకు.. నిప్పంటించుకున్న భార్య

వికారాబాద్​జిల్లా, వెలుగు: కూర బాగాలేదని భర్త మందలించినందుకు క్షణికావేశంలో కిరోసిన్​ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంది ఓ మహిళ. 45 రోజుల పసివాడున్నాడని మరచి ప్రాణం తీసుకుంది. ఈ నెల 2న వికారాబాద్​ జిల్లా కామారెడ్డి గూడెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి గూడేనికి చెందిన రాఘవేంద్రా చారి, కర్ణాటకలోని సేడం తాలూకా అడికకు చెందిన బల్లారి కవిత (21)ను రెండేండ్ల కింద పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు 45 రోజుల కొడుకు ఉన్నాడు. వంట బాగాలేదని ఈ నెల 1న కవితను రాఘవేంద్రాచారి మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన కవిత 2వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన కవితను రాఘవేంద్రాచారి వికారాబాద్​ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె పరిస్థితి సీరియస్​గా ఉండడంతో అక్కడి నుంచి గాంధీకి తరలించారు. కొద్ది రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న కవిత గురువారం ఉదయం చనిపోయింది. అయితే ఆమెకు దసరా పండుగ నుంచి మానసిక స్థితి బాగాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాఘవేంద్రచారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest Updates