పదకొండేళ్ల ప్రేమ కోసం మతం మారాను.. అన్యాయం జరిగింది

తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ప్రేమికులు ఎన్ని కష్టాలైనా పడతారు, ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు.. ఇలా వీటన్నిటిని దాటుకొని పెద్దల అంగీకారంతో తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంటారు. వికారాబాద్ కు చెందిన ఓ యువకుడు కూడా తన ప్రేమ కోసం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొన్నాడు. చిన్ననాటి  స్నేహితురాలినే తన జీవిత భాగస్వామగా చేసుకుందామనుకున్నాడు. ఆమె ప్రేమను గెలుచుకొని పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. కానీ తమ మతానికి చెందిన వాడు కాకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు అతని ప్రేమను ఒప్పుకోలేదు. తనది నిజమైన ప్రేమ అనీ, ప్రేయసి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వారికి తెలుపగా… మార్చుకుంటే పెళ్లికి ఓకే అన్నారు. తీరా మార్చుకున్న తర్వాత..  నో అన్నారు. అసలేం జరిగిందంటే…

వికారాబాద్ కు చెందిన బొబ్బిలి భాస్కర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ హునైన్ (25) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువతి(23) ని 2008 నుంచి  ప్రేమిస్తున్నాడు. చిన్నతనం నుంచి ఒకే స్కూల్ చదువుకున్న వీరు మంచి స్నేహితులు. కొన్నాళ్లకు వీరి స్నేహం కాస్త ప్రేమగా చిగురించడంతో.. ఇద్దరు డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే వీరి వివాహానికి మతం అడ్డురావడంతో సుల్తానా కుటుంబ సభ్యులు నిరాకరించారు.

క్రిస్టియన్ మతానికి చెందిన భాస్కర్ ను ఇస్లాం మతం స్వీకరిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని నిబంధన పెట్టారు. దీనితో భాస్కర్ తాను ప్రేమించిన యువతి కోసం ఢిల్లీ కు వెళ్లి ఇస్లాం మతం స్వీకరించడం కోసం 11 నెలల పాటు శిక్షణ పొంది , తాండూరు లోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మత ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలవగా, వాళ్లు అతడెవరో తెలియనట్లు వ్యవహరించారు. ఆమెని కలవనివ్వకుండా , ఆమె తండ్రి , కుటుంబ సభ్యులు దుర్భాషలాడటమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డారు.

తనకు జరిగిన అన్యాయాన్ని వికారాబాద్ పోలీసులకు తెలిపాడు భాస్కర్. అయితే తన ప్రేమను పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ .. న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. తాను ప్రేమించిన యువతితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకొని , తామిద్దరికి ప్రాణ రక్షణ కల్పించాలని భాస్కర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ HRC ని వేడుకున్నాడు.

Latest Updates