4వందల ఏళ్లుగా ఆచారం: మాఘ పౌర్ణమిన ఊరు ఖాళీ

మాఘ మాసంలో పౌర్ణమి రోజు చేసే స్నానం, పూజలు, దానాలతో వ్యాధులు, చికాకుల నుండి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం. దీంతో పాటు చనిపోయిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఇంతటి విశిష్టమైన మాఘ పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామం మాత్రం 400 ఏళ్లుగా ఒక వింత ఆచారాన్ని కొనసాగిస్తోంది.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మాఘ పౌర్ణమి రోజున పూర్తిగా ఖాళీ అయిపోతుంది. గ్రామంలోని ప్రజలందరూ కుల, మత భేదం లేకుండా తెల్లవారుజామునే హాజీవలి దర్గాకు వెళ్లిపోతారు. తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గ్రామంలోని చిన్నా పెద్దా అంతా సూర్యోదయానికి ముందే ఇళ్లకు తాళాలు వేసి, పశువులను కూడా తమతోపాటు తీసుకొని హాజీవలి దర్గాకు చేరుకుంటారు.

గ్రామస్థులంతా కలిసి అక్కడే వంటావార్పూ చేసుకొని కలిసి భోజనాలు చేస్తారు. సూర్యాస్తమయం తర్వాతే గ్రామానికి తిరిగి వెళ్తారు. గ్రామానికి చేరుకున్న తర్వాత, ప్రతి ఒక్కరూ గడప గడపకు కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే ఇంట్లోకి అడుగు పెడతారు. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి పొయ్యి వెలిగిస్తారు.

400 ఏళ్లుగా పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని తామంతా క్రమం తప్పకుండా పాటిస్తున్నామనీ, దీంతో గ్రామానికి మంచి జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందనీ  గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఈ ఆచారాన్ని అతిక్రమించిన కొందరు కష్టాల పాలయ్యారని చెబుతున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని నమ్మి ప్రతీ ఏడాది మాఘ పౌర్ణమిరోజున ఈ ఆనవాయితీని తప్పని సరిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Latest Updates