సాయానికి ముందుంటడు..

పుట్టిన కొన్ని రోజులకే వినాయక్ అనాధయ్యాడు. బంధువులకు భారమై రోడ్డున పడ్డాడు.అరవయ్యేళ్ల వృద్ధ దంపతులు అతణ్ని చేరదీశారు.స్కూల్లో చదివిస్తూనే..క్వారీలో రాళ్లు కొట్టే పనిలో పెట్టారు. ఆస్తిపాస్తు లేవీ పంచివ్వకున్నా ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో పెంచారు. వినాయక్ కూడా తల్లిదండ్రులను దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించేవాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరిగా ఇద్దరూ కన్నుమూశారు. తర్వాత వినాయక్ ఎన్నో రకాల పనులు చేసి చివరికి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. వ్యాపారం కొనసాగిస్తూ నే 2002లో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా పేదలకు తన వంతు సాయం చేస్తున్నాడు.

వినాయక్ చదువు ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అందుకే ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని పిల్లల కోసం ఏకంగా ఒక స్కూల్​నే స్థాపించాడు. అందులో వాళ్లకు ఉచితంగా చదువు నేర్పిస్తున్నాడు. ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ , బ్యాగులు కూడా అందిస్తున్నాడు. అంతేకాదు, వంద మంది వితంతువులకు నెలకు మూడొందల రూపాయల చొప్పున అందిస్తూ వాళ్లకి ఆసరాగా నిలుస్తున్నాడు. పెద్దపెద్ద జబ్బులొస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే పేదలకు వైద్యానికి అయ్యే ఖర్చు కూడా పూర్తిగా తనే అందిస్తూ వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నాడు.

పెంచిన ప్రేమ దూరమైంది

మూడు నెలల వయసప్పటి నుంచి వినాయక్ ని కంటికి రెప్పలా పెంచారు దత్తత తీసుకున్న తల్లిదండ్రులు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బాబుకు కావాల్సినవన్నీ సమకూర్చారు. కొన్నిరోజులతర్వాత ఆ కుటుంబం పుణెలోని విశ్రాంత్ వాడీకి మకాం మార్చింది. వినాయక్ కి పదహారేళ్లవయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు.అప్పుడు అతను పదో తరగతి పరీక్షల కోసం చదువుకుంటున్నాడు. తండ్రి చనిపోయిన బాధతో పరీక్షల్లో సరిగా రాయలేదు. కొన్నిసబ్జెక్టుల్లో ఫెయిల్​ అయ్యాడు. దాంతో చదువుకు అక్కడ ఫుల్​స్టాప్ పడింది. వితంతురాలైన తల్లినిపోషించడానికి పనిబా ట పట్టాడు. ఇంతలో తల్లికి క్యాన్సర్ అని తేలింది. తాను చనిపోతే, కొడుకు మళ్లీ అనాథ అవుతాడని కుమిలిపోయిందామె. అందుకే అతనికి తోడు కోసం పదహారేళ్లవయసులో పదమూడున్నరే ళ్ల అమ్మాయితో పెళ్లి చేసింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆమె చనిపోయింది. అలా వినాయక్ చిన్న వయసులోనే అన్నిరకాల బాధలను అనుభవించాడు.

నలుగురికీ సాయం చేయాలి

వినాయక్ పదో తరగతి కూడా పాస్ కాకపోవడంతో ఎక్కడా మంచి ఉద్యోగం దొరకలేదు. లాటరీ టికెట్లు అమ్మడం దగ్గరి నుంచి హోటల్​లో వెయిటర్ ఉద్యోగం వరకు అన్నీ చేశాడు.చివరికి రియల్​ ఎస్టేట్​ వ్యాపారం​లో దిగి కాస్తంత ఆర్థికంగా కుదురుకున్నాడు. ఆ క్రమంలోనే సమాజాన్ని కుటుంబంతో సమానంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. పేదరికంలో ఉన్న వాళ్లకు ఏదో విధంగా సాయపడాలనుకున్నాడు. అలా స్థాపించిందే ‘జీవన్​ మిత్ర ప్రతిస్థాన్​’. మొదట ఇంటింటికీ తిరిగి డబ్బులు పోగు చేశాడు. తర్వాత పెద్దపెద్ద కంపెనీలకు కూడావెళ్లి విరాళాలు సేకరించాడు. వాటితో నలుగురికి సాయం చేయడం ప్రారంభించాడు.

పదకొండు రూపాయలతో మొదలు

గాంధేయవాదైన వినాయక్ , ఆ స్వచ్ఛంద సంస్థను అన్నా హజారే చేతుల మీదుగా ప్రారంభించాడు. మొదట్లో భార్య వద్దని వారించినా,ఇప్పుడు మనస్ఫూర్తిగా భర్త చేపట్టిన ప్రతి పనికీ సాయం అందిస్తోంది. మొదటిసారిగా సేకరించిన విరాళాలు మొత్తం లక్షా ఇరవై వేలు అయ్యాయి. ఆ డబ్బును గుండె జబ్బుతో బాధపడుతున్న తుషార్ అనే అబ్బాయి సర్జరీ కోసం ఖర్చు చేశాడు. అలా ఆ ప్రయాణం మొదలైంది.ఈ పన్నెండేళ్లలో ఆ సంస్థ మొత్తం ఆరున్న కోట్ల రూపాయలను సేకరించింది. ఎంతోమంది  బాధితులకు అండగా నిలిచింది. సుమారువెయ్యికి పైగా పేద ప్రజలకు క్యాటరాక్ట్​ సర్జరీలు చేయించాడు. ఒకప్పుడు తన బస్తీ వాళ్లకు కూడా తెలియని వినాయక్ పేరు… ప్రస్తుతం పుణెలో చాలామందికి తెలుసు. వాట్సాప్ లో అతనికి దాదాపు పద్నాలుగు వేలమంది ఫ్రెండ్స్ ఉన్నారు.

చదువే జీవితాలకు వెలుగు

ఏది ఉన్నా లేకున్నా చదువు ఒక్కటుంటే చాలని నమ్ముతాడు వినాయక్ . అందుకే స్కూల్ పెట్టి ప్రస్తుతం నాలుగో తరగతి వరకు దాదాపు 270 మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాడు.అందులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల పిల్లలు 30 మంది ఉన్నారు.బ్యాగులు, పుస్తకాలే కాదు పిల్లలకు అవసరమైన స్టేషనరీ, షూస్ , రెయిన్ కోట్లు మొదలైనవన్నీ అందిస్తున్నాడు.ఇప్పుడు ఆ స్కూల్ లో 18 మంది టీచర్లు ఉన్నారు. అందులో పద్నాలుగు మంది విద్యాధికులైన టీచర్లున్నారు. 2019 జూన్ నుంచి ఆ స్కూల్ లో అయిదో తరగతిని కూడా చేరుస్తామని చెప్పాడు వినాయక్.

Latest Updates