ఫీవర్లపై ఫికర్​ వద్దు: ఈటల

  • ప్రభుత్వ హాస్పిటల్స్​లో ప్రత్యేక ఏర్పాట్లు
  • విష జ్వరాలు పెరిగిన మాట వాస్తవం.. కానీ తీవ్రత తగ్గింది
  • అవి డెంగీ మరణాలు కాదు.. వాటికి వేరే కారణాలు ఉండొచ్చు
  • గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు ఈటల, తలసాని

హైదరాబాద్, వెలుగు:

‘‘రాష్ట్రంలో పెరుగుతున్న వైరల్​ ఫీవర్స్​ తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ముసురు వల్ల, సన్ లైట్ లేని కారణంగా జ్వరాలు పెరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు 24 గంటలు కష్టపడుతున్నాం”అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ చెప్పారు. ప్రభుత్వమే అన్నీ చేయలేదని, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు. పరిసరాలను క్లీన్​గా ఉంచుకోవాలని, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కనీసం కాచిన నీటినైనా తాగాలని ఆయన సూచించారు. గతంతో పోల్చుకుంటే వైరల్ ఫీవర్స్ పెరిగిన మాట వాస్తవమేనని, కానీ వాటి తీవ్రత మాత్రం అంతగా లేదని చెప్పారు. గాంధీ హాస్పిటల్ లో వైరల్ ఫీవర్స్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్​ వార్డులను మరో మంత్రి తలసానితో కలసి ఈటల ప్రారంభించారు. వీటిలో పురుషుల కోసం 20 బెడ్లు, మహిళల కోసం 20 బెడ్లను ఏర్పాటు చేశారు. హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న రోగులను కలిసి.. వారికి అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.

టీచింగ్​ హాస్పిటల్స్​లో ఈవెనింగ్​ ఓపీ

ఆ తర్వాత మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. వైరల్​ ఫీవర్స్​కు సంబంధించి అన్ని సర్కారీ దవాఖాన్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.టీచింగ్ హాస్పిటల్స్ లో ఈవెనింగ్ ఓపీ ఉంటుందని, డాక్టర్లకు సెలవులు రద్దు చేశామని, ఎంతమంది పేషెంట్లు వచ్చినా ట్రీట్​మెంట్ అందిస్తారని చెప్పారు. అవసరమైతే వేరే వార్డులను కూడా వైరల్ ఫీవర్స్ ట్రీట్​మెంట్​ కోసం వాడతామన్నారు. మందులు, సెలైన్లు, డాక్టర్లు, ప్లేట్ లెట్​ మిషన్ల కొరత లేదని, జనం ఆందోళన చెందాల్సి పనిలేదని చెప్పారు. గతంలో డెంగీ లక్షణాలకు, ఇప్పుడు వస్తున్న డెంగీ జ్వరాలకు చాలా తేడాలున్నాయని, డెంగీ అనగానే మరణాలు సంభవించే ప్రమాదం లేదన్నారు. విష జ్వరాల నివారణలో ప్రభుత్వ వైఫల్యం ఏమీలేదన్నారు. జూన్ నుంచే ముందస్తు చర్యలు చేపట్టామని ఇది నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తరఫున దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తున్నామని, అవసరమైనన్ని ఫాగింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలని చెప్పామన్నారు.

ఆ మరణాలకు వేరే కారణాలు ఉండొచ్చు

ఇటీవల కొంతమంది డెంగీతో మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ అవి డెంగీ మరణాలు కాదని.. వాటికి కారణాలు వేరే ఉండవచ్చన్నారు. మలేరియా, టైఫాయిడ్ తోపాటు హై టెంపరేచర్ తో మల్టీ ఆర్గాన్స్​ ఫెయిల్యూర్, లివర్, కిడ్నీ లాంటి సమస్యలు కూడా వాటికి కారణాలు కావొచ్చని చెప్పారు. డెంగీ ఫీవర్ల నిర్ధారణకు ఓ హైలెవల్​ మెడికల్​ టీమ్​ ఉంటుందని, వారు నిర్ధారించిన వాటినే డెంగీ మరణాలుగా భావించాలని ఆయన అన్నారు. ఇటీవల చనిపోయిన వారు ఏ కారణంతో చనిపోయారో రిపోర్టులు ఉంటాయని, వాటిని తీస్తామని, ఇవాళ కాకపోతే రేపైనా నిజాలు బయటపడతాయని, సమాజానికి, తమకూ కారణాలు తెలియాల్సి ఉందని ఈటల అన్నారు. ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడటం సరికాదని, 24 గంటలు ఇక్కడ ఉండి పనిచేస్తే తెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు.

Latest Updates