కోతికున్న సోయి లేదా!

నీళ్లు వేస్ట్ కాకుండా
ఆకులతో పైపును
మూసేందుకు ఓ కోతి ప్రయత్నం
ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో వీడియో వైరల్

ఎవరైనా తులువ పని చేస్తే.. ‘ఆపురా నీ కోతి చేష్టలు’ అంటుంటాం. కానీ.. కోతులన్నీ తులువ పనులు చేయవని, మన కన్నా బాధ్యతగా ఉంటాయనీ ఈ కోతి నిరూపించింది. ఎక్కడ జరిగిందో కానీ.. ఓ చోట నల్లా పైపు నుంచి నీళ్లన్నీ వేస్ట్ గా పోతున్నాయి. దాహం వేసి నీళ్లు తాగడానికి వచ్చిందో, ఏమో ఈ కోతి అటువైపు వచ్చింది. చూస్తే నీళ్లన్నీ వేస్ట్ గా పోతున్నాయి. నీళ్లు దొరకనప్పుడు గొంతు ఎండిపోయిన సంగతి గుర్తొచ్చిందేమో..  ఇలా వేస్ట్ గా పోనివ్వద్దని అనుకుంది. కానీ ఏం చేయాలో తెలియలేదు. చుట్టూ ఎండిపోయిన ఆకులు ఉండటంతో వాటిని తీసుకుని పైపులోకి కుక్కి నీళ్లను ఆపే ప్రయత్నం చేసింది. జస్ట్14 సెకన్లే ఉన్న ఈ వీడియోను ‘సేవ్ వాటర్’ అనే క్యాప్షన్ తో నిహారికా సింగ్ అనే మహిళ ట్విట్టర్ లో పెట్టడంతో కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది.

‘‘జంతువులే నీళ్లను ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మనం మనుషులం ఎందుకు చేయకూడదు?” అంటూ ఒకరు.. ‘‘ఈ భూమిపై అత్యంత అసహజ లైఫ్​స్టైల్ తో బతికేది మానవ జాతి మాత్రమే” అంటూ ఒకరు.. ‘‘జంతువుల నుంచి మనుషులు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి” అని ఇంకొకరు కామెంట్లు చేశారు. ఆగస్టు నెలలోనూ ఇలాంటి ఓ వీడియో టిక్ టాక్ లో వైరల్ అయింది. ఓ గోడ పక్కన ఉండే నల్లా దగ్గరకు వచ్చిన ఓ కోతి నీళ్లు తాగిన తర్వాత, ఆ నల్లాను పూర్తిగా బంద్ చేసి వెళుతుంది. అప్పుడు కూడా ‘‘ఎంతైనా.. ఈ మూగజీవులకు ఉన్న సోయి కూడా కొందరు మనుషులకు ఉండదు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Latest Updates