టార్గెట్‌ క్లీన్ స్వీప్..ఇవాళ సఫారీలతో మూడో టెస్ట్

రాంచీవరుసగా రెండు టెస్ట్‌‌లు గెలిచాకా.. మూడో మ్యాచ్‌‌ను ఎవరూ పెద్దగా  పట్టించుకోరు. కానీ వరల్డ్ చాంపియన్‌‌షిప్‌‌ పుణ్యమాని.. ఇప్పుడు ప్రతి మ్యాచ్‌‌ కీలకం కావడంతో ఇండియా టీమ్‌‌.. శనివారం నుంచి మొదలయ్యే రాంచీ టెస్ట్‌‌లోనూ విక్టరీపై కన్నేసింది. తద్వారా 3–0తో సిరీస్‌‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. దీనికితోడు 2015లో త్రుటిలో తప్పిపోయిన సఫారీల వైట్‌‌వాష్‌‌ను ఈసారి దిగ్విజయంగా పూర్తి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను అప్పట్లో టీమిండియా 3–0తో కైవసం చేసుకుంది. వర్షం వల్ల బెంగళూరు మ్యాచ్‌‌ డ్రా కావడంతో  సఫారీలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు బాగా మారాయి. కింగ్‌‌ కోహ్లీసేన రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంటే.. ప్రొటీస్‌‌ ప్లేయర్లు ఫామ్‌‌ లేమితో చెత్త పరాజయాలను మూటగట్టుకుంటున్నారు. ఓవరాల్‌‌గా నాలుగేళ్ల కిందటి పోరాటస్ఫూర్తిని సఫారీలు ఈ మ్యాచ్‌‌లో చూపెడతారా? లేదా? చూడాలి.

కుల్దీప్‌‌ ఔట్‌‌.. నదీమ్‌‌ ఇన్‌‌

ప్రస్తుతానికి టీమిండియా లైనప్‌‌ మార్చే చాన్స్‌‌ లేకున్నా.. పిచ్‌‌, పరిస్థితుల వల్ల ఒక్క మార్పు చోటు చేసుకోవచ్చు. రాంచీ వికెట్‌‌ డ్రైగా ఉండి స్పిన్‌‌కు అనుకూలమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మూడో పేసర్‌‌కు బదులుగా ఎక్స్‌‌ట్రా స్పిన్నర్‌‌ను తీసుకునే చాన్స్‌‌ ఉంది. అయితే మణికట్టు స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ భుజం నొప్పితో ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో లోకల్‌‌ స్పిన్నర్‌‌ షాబాజ్‌‌ నదీమ్‌‌ను టీమ్‌‌లోకి తీసుకున్నా.. ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఉంటాడో లేదో తెలియదు. గతేడాది విండీస్‌‌తో టీ20లకు ఎంపికైనా.. తుది జట్టులో చాన్స్‌‌ రాలేదు. ఇప్పుడు రాంచీ హోమ్‌‌ గ్రౌండ్‌‌ కాబట్టి షాబాజ్‌‌కు అవకాశం ఇస్తే.. పేసర్లలో ఇషాంత్‌‌, ఉమేశ్‌‌లో ఒకరిపై వేటు తప్పదు. షమీ స్థానానికి ఢోకా లేదు. ఇక బ్యాటింగ్‌‌కు విషయానికొస్తే టాప్‌‌ ఆర్డర్‌‌.. టీమిండియాకు అతిపెద్ద బలం. ఇందులో ఎలాంటి సమస్యల్లేవు. ఓపెనర్‌‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రోహిత్‌‌, మయాంక్‌‌… గత రెండు మ్యాచ్‌‌ల్లో సఫారీ పేస్‌‌ త్రయాన్ని దుమ్ము దులిపేశారు. అదే ఫామ్‌‌ ఇక్కడా కొనసాగితే భారీ స్కోరు ఖాయం. కింగ్‌‌ కోహ్లీ.. పుణెలో డబుల్‌‌ సెంచరీతో సూపర్‌‌ ఫామ్‌‌లోకి వచ్చాడు. పుజారా రెండు హాఫ్‌‌ సెంచరీలతో టచ్‌‌లోకి వచ్చినా భారీ ఇన్నింగ్స్‌‌ బాకీ ఉన్నాడు. వైస్‌‌ కెప్టెన్‌‌ రహానె నుంచి కూడా టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ మంచి ఇన్నింగ్స్‌‌ ఆశిస్తోంది. గత రెండు టెస్ట్‌‌ల్లో ప్రొటీస్‌‌ బౌలర్లందరూ కలిపి 16 వికెట్లు మాత్రమే తీశారంటే టీమిండియా డామినేషన్‌‌ ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. వికెట్ల వెనుక పెట్టని గోడలా ఉంటూ కళ్లు చెదిరే క్యాచ్‌‌లు పడుతున్న వృద్ధిమాన్‌‌ సాహా మరోసారి కీలకం కానున్నాడు. తుది జట్టులో భారీ మార్పులు లేకపోవడంతో తెలుగు ప్లేయర్‌‌ హనుమ విహారి బెంచ్‌‌కే పరిమితంకానున్నాడు.

టాప్‌‌ ఆర్డర్‌‌ ఆడుతుందా?

వాస్తవానికి సఫారీ జట్టు పెద్ద పేలవంగా ఏమీలేదు. కాకపోతే అనుభవం తక్కువగా ఉన్న ఆటగాళ్లు ఉండటంతో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నారు. రెండో టెస్ట్‌‌లో టెయిలెండర్లు కేశవ్‌‌ మహారాజ్‌‌, ఫిలాండర్‌‌ పోరాడిన తీరే ఇందుకు నిదర్శనం. ఈ మ్యాచ్‌‌ కోసం తుది జట్టులో రెండు, మూడు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. గాయం వల్ల ఓపెనర్‌‌ ఐడన్‌‌ మార్‌‌క్రమ్‌‌ స్వదేశానికి వెళ్లిపోగా.. ఎల్గర్‌‌తో కలిసి హమ్జా ఇన్నింగ్స్‌‌ ఆరంభించనున్నాడు. కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌, డికాక్‌‌, బవుమాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వీళ్లు రాణిస్తేనే.. ఈ మ్యాచ్‌‌లో ప్రొటీస్‌‌ విజయాన్ని ఆశించొచ్చు. బ్యాటింగ్‌‌ కంటే బలంగా కనిపిస్తున్న పేస్‌‌ బౌలింగ్‌‌.. గత మ్యాచ్‌‌ల్లో టీమిండియాను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రబడ, ఫిలాండర్‌‌, నోర్జ్‌‌తో కూడిన పేస్‌‌ దళం అంచనాలు అందుకోలేకపోతున్నది. ఇండియన్‌‌ పేస్‌‌ అటాక్‌‌.. చకచకా వికెట్లు తీస్తున్న చోట.. సఫారీ పేస్‌‌ బలగం ఘోరంగా నిరాశపరుస్తోంది. అయితే నోర్జ్‌‌ స్థానంలో ఎంగిడి తుది జట్టులోకి వచ్చే చాన్స్‌‌ కూడా ఉంది. స్పిన్నర్‌‌ మహారాజ్‌‌ స్థానంలో లెఫ్టార్మ్‌‌ లెగ్గీ జార్జ్‌‌ లిండె టీమ్‌‌లోకి వచ్చాడు. సెకండ్‌‌ టెస్ట్‌‌కు దూరమైన ఫీట్‌‌తో కలిసి ముత్తుసామి స్పిన్‌‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, మయాంక్‌‌, పుజారా, రహానె, జడేజా, సాహా, అశ్విన్‌‌,  ఉమేశ్‌‌ / నదీమ్‌‌, షమీ.

సౌతాఫ్రికా: డుప్లెసిస్‌‌ (కెప్టెన్‌‌), ఎల్గర్‌‌, హమ్జా, డ్రీబూన్‌‌, బవుమా, డికాక్‌‌, ముత్తుసామి, ఫిలాండర్‌‌, నోర్జ్‌‌ / ఎంగిడి, పీట్‌‌, రబడ.

పిచ్‌‌, వాతావరణం

సాధారణంగా బ్యాటింగ్‌‌కు అనుకూలం. క్రమంగా స్పిన్‌‌కు సహకరిస్తుంది. పిచ్‌‌ పొడిగా ఉంది. తొలి మూడు రోజులు వాన గండం లేదు. చివరి రెండు రోజులు జల్లులు పడే అవకాశం ఉంది. రాంచీలో ఇది రెండో టెస్ట్‌‌. 2017లో ఇండియా– ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరిగిన టెస్ట్‌‌ డ్రా గా ముగిసింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates