ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు విరాట్​ దూరం?

పెటర్నిటీ లీవ్ తీసుకునే ఛాన్స్

టీమిండియా బబుల్ లో కలిసిన విరాట్

టీమ్ తోపాటు ఆసీస్ కు రోహిత్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌ ముగిసిన వెంటనే జంబో టీమ్‌‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్‌‌ తర్వాత ఫస్ట్‌‌ టైమ్‌‌ ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ మొదలు పెట్టనుంది. కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌‌తో పాటు నాలుగు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌‌లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్‌‌ మ్యాచ్‌‌ కూడా ఉండే టెస్టు సిరీస్‌‌ను ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ, తొందర్లోనే తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లీ  ఈ సిరీస్‌‌ చివరి రెండు మ్యాచ్‌‌లకు దూరమయ్యే చాన్స్​ కనిపిస్తోంది. అదే జరిగితే అతని ప్లేస్‌‌లో లోకేశ్‌‌ రాహుల్‌‌ మిడిలార్డర్‌‌లో ఎంట్రీ  ఇవ్వడం ఖాయం కానుంది.  కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. బోర్డు నుంచి అఫీషియల్‌‌గా ఇంకా సమాచారం రానప్పటికీ  ఫస్ట్‌‌ రెండు టెస్టులు ముగిసిన వెంటనే కోహ్లీ పెటర్నిటీ లీవ్‌‌ తీసుకునే చాన్సుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఫ్యామిలీకి ప్రియారిటీ ఉండాలని బీసీసీఐ విశ్వసిస్తుందని, పెటర్నిటీ లీవ్‌‌ తీసుకోవాలని కోహ్లీ నిర్ణయించుకుంటే అతను తొలి రెండు మ్యాచ్‌‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బోర్డు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ‘నార్మల్‌‌ టైమ్‌‌లో కోహ్లీ ఇండియా వచ్చి తన బిడ్డను చూసి తిరిగి ఆసీస్‌‌ వచ్చేందుకు ఒక టెస్టు మిస్సయ్యేవాడు. బ్రిస్బేన్‌‌లో లాస్ట్‌‌ టెస్టులో ఆడేవాడు. కానీ, 14 రోజుల క్వారంటైన్‌‌ రూల్‌‌ అమల్లో ఉంటే మాత్రం అతను తిరిగి జట్టుతో కలవడం కష్టం’ అని సదరు అధికారి అభిప్రాయపడ్డారు. కాగా, గాయం నుంచి కోలుకున్న ఇండియా వైట్‌‌బాల్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ జట్టుతో పాటు ఆసీస్‌‌ వెళ్లే అవకాశం ఉంది. ‘రోహిత్‌‌ విషయంలో తొందర్లోనే నిర్ణయం తీసుకుంటారు. అయితే అతను జట్టుతో పాటే ఉండి ఫిజియో నితిన్‌‌ పటేల్‌‌, ట్రెయినర్‌‌ నిక్‌‌ వెబ్‌‌ పర్యవేక్షణలో స్ట్రెంత్‌‌ అండ్‌‌ కండీషనింగ్‌‌పై దృష్టిపెడితే బాగుంటుంది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

తొడ కండరాల గాయం కారణంగా రోహిత్‌‌ను ఆసీస్‌‌ టూర్‌‌లో ఏ టీమ్‌‌లోకి తీసుకోలేదు. అయితే, హిట్‌‌మ్యాన్‌‌ ఐపీఎల్‌‌ ప్లే ఆఫ్స్‌‌లో బరిలోకి దిగడంతో అతడిని జట్టులో చేర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దాంతో, ఈ నెల 27న మొదలయ్యే వన్డే సిరీస్‌‌కు రెస్ట్‌‌ ఇచ్చి టీ20 సిరీస్‌‌లో అయినా రోహిత్​ను ఆడించే ఆలోచన బోర్డు చేయొచ్చు. కాగా, ఐపీఎల్‌‌లో ఆర్‌‌సీబీ పోరాటం ముగియడంతో ఆ టీమ్‌‌ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ.. ఆసీస్‌‌ టూర్‌‌కు సెలెక్టైన ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన టీమిండియా బయో బబుల్‌‌లో ఎంటరయ్యాడు. శుక్రవారం రాత్రే అతను బబుల్‌‌లోకి వచ్చాడని  జట్టు వర్గాలు తెలిపాయి. మరోపక్క చటేశ్వర్‌‌ పుజారా, హనుమ విహారితో కలిసి మయాంక్‌‌ అగర్వాల్‌‌ లాంటి ప్లేయర్లు ఇప్పటికే బబుల్‌‌లో ప్రాక్టీస్‌‌ ప్రారంభించారు.

Latest Updates