శివమ్ వచ్చేశాడు.. విరాట్‌కు ఇక విశ్రాంతి

  • టీ20ల్లో శాంసన్‌కు పిలుపు
  • బంగ్లాతో సిరీస్‌లకు టీమిండియా​ఎంపిక

ఆస్ర్టేలియాలో టీ20 వరల్డ్​ కప్​ కోసం టీమిండియా సన్నాహాకాలు మొదలయ్యాయి..! డొమెస్టిక్ టోర్నీల్లో సత్తా చాటిన కుర్రాళ్లకు ధనాధన్ ఫార్మాట్లో అవకాశం కల్పిస్తూ బంగ్లా సిరీస్​కు టీమ్​ను ఎంపిక చేసింది..! అవసరమైన పాతవారిని తిరిగి తీసుకుంటూ.. కొత్తగా ముంబై ఆల్‌రౌండర్​

శిమమ్ దూబేను పరీక్షించేందుకు సిద్ధమైంది..! అలాగే పంత్‌కు పోటీగా తయారవుతున్న సంజూ శాంసన్‌కు కూడా మళ్లీ ఓ చాన్స్ ఇచ్చింది..! ఓవరాల్‌గా పక్కా లెక్కలతో సాగిన ఎంపికలో విరాట్‌కు విశ్రాంతినిస్తూ.. రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది..! ఇక టెస్టులకు మాత్రం మార్పుల్లేని టీమిండియాను ఎంపిక చేసి చేతులు దులిపేసుకుంది..!!

ముంబై: భారీ మార్పులు లేకుండానే.. బంగ్లాదేశ్​తో మూడు టీ20లు, రెండు టెస్టులకు ఇండియా టీమ్​ను  ప్రకటించారు. గురువారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ చెరో 15 మందితో కూడిన రెండు జట్లను ఎంపిక చేసింది.  ఇండియా–ఎ తరఫున విశేషంగా రాణించిన ముంబై ఆల్​రౌండర్​ శివమ్ దూబేకు ప్రతిఫలం దక్కింది. సెకండ్ చాయిస్  ఆల్​రౌండర్  విజయ్ శంకర్​ను కాదని, బిగ్ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న దూబేను టీ20లకు ఎంపిక చేశారు. వెన్నెముకకు ఆపరేషన్ చేయించుకున్న డాషింగ్ ఆల్​రౌండర్​ హార్దిక్ ​పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ‘ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్​రౌండర్​ ప్లేస్​కు దూబే సరిగ్గా సరిపోతాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. విండీస్, సౌతాఫ్రికాలో ఇండియా–ఎ తరఫున మెరుగ్గా ఆడాడు. అతని పెర్ఫామెన్స్ మెచ్చి అవకాశం ఇచ్చాం’ అని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు.. హిట్​మ్యాన్​ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించారు. 2015లో జింబాబ్వేపై ఏకైక టీ20 ఆడిన కేరళ బ్యాట్స్​మన్ సంజు శాంసన్​కు మళ్లీ పిలుపు అందింది. ఇండియా–ఎ టీమ్‌లో   రెగ్యులర్ మెంబర్ అయిన శాంసన్.. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్​ల్లో 410 రన్స్ చేయడం కలిసొచ్చింది. ఇందులో డబుల్ సెంచరీ (212 నాటౌట్) కూడా ఉండటం విశేషం. లెగ్​ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తిరిగి టీమ్​లోకి రాగా, జడేజాకు విశ్రాంతి ఇచ్చారు. ఫిట్​నెస్​ లేకపోవడంతో ఢిల్లీ పేసర్ నవదీప్​ సైనీకి ఉద్వాసన పలికిన సెలెక్షన్​ కమిటీ.. శార్దూల్ ఠాకూర్​ను  టీమ్​లోకి తీసుకుంది. నవంబర్​3, 7, 10వ తేదీల్లో  ఢిల్లీ, రాజ్​కోట్, నాగ్​పూర్​లో  వరుసగా మూడు టీ20లు జరుగుతాయి.

టెస్ట్​లకు సేమ్ టీమ్..

సౌతాఫ్రికాతో చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న టీమ్​నే యథావిధిగా బంగ్లాతో సిరీస్​కు కొనసాగించారు. రాంచీ టెస్ట్​లో నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్ ​షాబాజ్​ నదీమ్​కు అవకాశం దక్కలేదు. ముందుగా ఉన్న టీమ్​లో అతను లేకపోవడమే ఇందుకు కారణం. గాయం కారణంగా కుల్దీప్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో నదీమ్ టీమ్​లోకి వచ్చాడు. వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న బుమ్రా రావడానికి మరికొంత సమయం పడుతుందని ప్రసాద్ వెల్లడించాడు. వరల్డ్ చాంపియన్​షిప్​లో భాగంగా నవంబర్​ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ (ఇండోర్), 22 నుంచి 26 వరకు (కోల్​కతా) రెండో టెస్ట్ జరుగుతుంది.

 

Latest Updates