మనసును కదిలించిన విరాట్‌‌ లేఖ

న్యూఢిల్లీ: రికార్డుల వీరుడు.. సెంచరీల ధీరుడు టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ 31వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ శుభదినాన్ని భూటాన్​లో భార్య అనుష్కశర్మతో ఆస్వాదించిన బర్త్‌‌డే బాయ్‌‌ ట్విటర్‌‌‌‌ వేదికగా చేసిన భావోద్వేగపు పోస్ట్‌‌ ప్రతీ ఒక్కరి మనసును కదిలిస్తోంది. తన ప్రయాణం.. జీవితం నేర్పిన పాఠాలను 15 ఏళ్ల  చీకూ(విరాట్‌‌ ముద్దు పేరు)కు తన స్వహస్తాలతో రాసిన స్వీయ లేఖలో కోహ్లీ వివరించిన తీరు ఆకట్టుకుంది.

‘హాయ్‌‌ చీకూ.. ఏ వెరీ హ్యాపీ బర్త్‌‌డే! నీ భవిష్యత్తు గురించి నీకు చాలా సందేహాలున్నాయని తెలుసు. నన్ను క్షమించు. వాటిలో చాలావాటికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రతీ సర్‌‌ప్రైజ్‌‌ తియ్యగా.. ప్రతీ సవాల్‌‌ థ్రిల్లింగ్‌‌గా ఉంటుంది.  ప్రతీ ఓటమి ఏదో ఒకటి నేర్చుకోవాలనే కసిని పెంచుతుంది.  ఇప్పుడివి నీకు అర్థం కాకపోవచ్చు. గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం. నేను చెప్పేదేంటంటే.. నీ కోసం జీవితం పెద్ద విషయాలను దాచి ఉంచింది. అయితే  ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి  సిద్దంగా ఉండు. విఫలమైనా సరే తిరిగి పుంజుకుంటానని ఒట్టు వేసుకో. నిన్ను ఇష్టపడేవారున్నట్టే ద్వేషించేవారు కూడా ఉంటారు. నీ గురించి తెలియనివాళ్లను అస్సలు పట్టించుకోకు. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకు. ఈ రోజు నాన్న షూస్‌‌ గిఫ్ట్‌‌గా ఇవ్వలేదని ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఉదయాన్నే  డాడ్​  ఇచ్చే హగ్​, నీ హైట్​ విషయంలో ఆయన వేసే జోక్స్‌‌ ముందు అవి ఎందుకు పనికి రావు. నాన్న నీతో కఠినంగా ఉన్నా.. అది నీ మంచి కోసమే అని తెలుసుకో.  అమ్మనాన్న నిన్ను అర్థం చేసుకోవడం లేదని కొన్ని సార్లు  ఫీలయ్యుంటావు. కానీ ఈ లోకంలో మన కుటుంబం కంటే  మనల్ని ఎవరూ ఎక్కవగా ఇష్టపడరని గుర్తుపెట్టుకో. వారికి  ఆ ప్రేమ తిరిగివ్వు, వారితో ఎక్కువసేపు గడుపు.  నాన్నను ఎంత ప్రేమిస్తున్నావో  ఇప్పుడే ఆయనకు చెప్పు. రోజు చెప్తూనే ఉండు. చివరగా నీ మనస్సు చెప్పినట్లు విను. నీ కలలు నెరవేరేలా శ్రమించు. కలలు మన జీవితాల్ని ఎలా మారుస్తాయో ఈ ప్రపంచానికి చూపించు. నువ్వు నీలా ఉండు. ప్రతీ రోజును సూపర్‌‌‌‌గా మార్చుకో’ అంటూ కోహ్లీ లేఖలో రాసుకొచ్చాడు.

ఎఫ్‌‌5  బటన్‌‌లా కోహ్లీ బ్యాటింగ్‌‌..

బర్త్‌‌డే బాయ్‌‌ కోహ్లీకి బీసీసీఐతో పాటు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు విషెస్‌‌ తెలియపారు. ట్వీట్ల మాస్టర్‌‌ సెహ్వాగ్‌‌ మరోసారి ఆకట్టుకునే ట్వీట్‌‌తో అలరించాడు. ‘ కోహ్లీ..ఎఫ్‌‌5( కంప్యూటర్‌‌ కీబోర్డులో  కీ) బటన్‌‌లా ఉండే నీ బ్యాటింగ్‌‌తో ప్రేక్షకులను ఎప్పుడూ రిఫ్రెష్‌‌ చేస్తూనే ఉండు. ఎప్పుడూ సంతోషంగా జీవించు’అని ఈ డాషింగ్ ఓపెనర్​ ట్వీట్​ చేశాడు.

Latest Updates