సాహసమే కోహ్లీ విజయ రహస్యం

53 టెస్ట్‌‌లు.. 33 విజయాలు..  వరుసగా12 సిరీస్‌‌ గెలుపులు.. 7 టెస్ట్‌‌ విక్టరీలు.. 4 ఇన్నింగ్స్‌‌ విజయాలు.. లెక్కలేనన్నీ రికార్డులు.. చరిత్రను తిరగరాసే మ్యాచ్‌‌లు.. సారథిగా టీమిండియాను కొత్త పుంతలు తొక్కిస్తూ ‘కింగ్‌‌’  కోహ్లీ సాధించిన విజయాల రికార్డులు ఇవి..! అసలు టీమిండియా ఇంత సూపర్‌‌ సక్సెస్‌‌ కావడానికి విరాట్‌‌ తెర వెనుక చేసిన కృషి ఏంటి? తీసుకున్న
సాహసోపేత నిర్ణయాలు ఏంటో చూద్దాం..!

వెలుగు క్రీడావిభాగం సచిన్‌‌, ద్రవిడ్‌‌, గంగూలీ, లక్ష్మణ్‌‌, కుంబ్లేలాంటి ‘ఫ్యాబులస్‌‌–5’ స్టార్లు టెస్ట్‌‌ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ స్థాయిలో ఆటపై ముద్ర వేసినోళ్లు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా కోహ్లీయే. మహేంద్రుడి మెరుపుల మధ్య వెలుగులు ఇవ్వడం తక్కువే అని కెరీర్‌‌ ఆరంభంలో కోహ్లీని తక్కువగా అంచనా వేసినా.. అనతి కాలంలోనే ప్రపంచ క్రికెట్‌‌ను శాసించే స్థాయికి తాను ఎదగడమే కాదు.. తనతో పాటు ఇండియాను తీసుకెళ్లాడు. ఇప్పుడు టీమిండియా అంటే ఒక్క కోహ్లీయే కాదు.. మొత్తం 11 మంది. ఇందులో ఎవర్ని టచ్‌‌ చేసినా బుల్లెట్‌‌ దెబ్బకు ఎదురెళ్లినట్లే.

కఠినాత్ముడు..

టీమ్‌‌లో ఉండే ప్రతి ఆటగాడు పర్‌‌ఫెక్ట్‌‌గా ఆడాలన్నది కోహ్లీ తపన. అచ్చం ధోనీ స్టైల్‌‌ నాయకత్వం. ఎక్కడా తగ్గేది లేదు.. ఎక్కడా హెచ్చేది లేదు. వైస్‌‌ కెప్టెన్‌‌గా ఉన్న రహానె, పుజారా ఫామ్‌‌ కోల్పోయి కొన్ని సిరీస్‌‌ల్లో వరుసగా విఫలమయ్యారు. ఆ టైమ్‌‌లో ఈ ఇద్దర్ని తప్పించి కోహ్లీ అతిపెద్ద సాహసం చేశాడు. ఓ మ్యాచ్‌‌లో భువనేశ్వర్‌‌ ఆరు వికెట్లు తీసి మ్యాచ్‌‌ను శాసించాడు. కానీ తర్వాతి మ్యాచ్‌‌లో అతనికి చోటు లేదు. కారణం.. ఆ పిచ్‌‌కు భువీ బౌలింగ్‌‌ సరిపోదని విరాట్‌‌ నమ్మకం. విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇషాంత్‌‌ తన సత్తా మేరకు వికెట్లు తీయడం లేదని రెండు సిరీస్‌‌లు పక్కనబెట్టేశాడు. విదేశాల్లో జడేజా, అశ్విన్‌‌ అవసరం లేదని నిర్దాక్షిణ్యంగా తప్పించేశాడు. అప్పటికీ ఈ ఇద్దరు స్టార్‌‌ స్పిన్నర్లు. అయితే ఆటగాళ్లను చూసి కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఫైనల్‌‌ ఎలెవన్‌‌ ఉండాలన్నది కోహ్లీ సిద్ధాంతం. దానిని నమ్మాడు కాబట్టే ఇన్ని విజయాలు. లిమిటెడ్‌‌ ఓవర్లలో మెరుపులు మెరిపించే రోహిత్‌‌కు.. కొన్నేళ్ల పాటు టెస్ట్‌‌ల్లో చోటు లేదు. కారణం మిడిలార్డర్‌‌కు అతను సరిపోడని తెలుసు కాబట్టే పక్కన పెట్టేశాడు. ఓపెనర్ల కొరత ఎప్పుడైతే మొదలైందో.. అప్పుడు రోహిత్‌‌తో ప్రయోగం చేశాడు. అది సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యింది. ఇలాంటి సాహసోపేత  నిర్ణయాలే రహానె, పుజారా, ఇషాంత్‌‌ను కౌంటీలకు పరుగెత్తించాయి. తమ టెక్నిక్‌‌తో పాటు ఆటను
మెరుగుపర్చుకునేలా చేశాయి.

ఆడకపోతే అంతే..

బయట ఎంత జోవియల్‌‌గా ఉన్నా.. గ్రౌండ్‌‌లో మాత్రం విరాట్‌‌ చాలా కఠినంగా ఉంటాడు. టీమ్‌‌లో పోటీ వాతావరణాన్ని సృష్టించడంతో పాటు దానిని ఎలా అధిగమించాలో కూడా చెప్పే గొప్ప కెప్టెన్‌‌. ‘ఒక్క ఇన్నింగ్స్‌‌లో వికెట్లు తీయలేకపోయినా.. ఇండియా తరఫున నా కెరీర్‌‌ ముగిసినట్లే’ అని ఇషాంత్‌‌ చెప్పాడంటే టీమ్‌‌లో పోటీతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగని భయపడి, ఒత్తిడి పెంచుకోకుండా ప్రతి ప్లేయర్‌‌ స్వేచ్చగా ఆడే అవకాశాన్ని కల్పిస్తాడు విరాట్‌‌. ‘ఈ పెర్ఫామెన్స్‌‌ సరిపోతుందని బయట ఉన్నవారు అనుకుంటే అది కష్టమే. ఎందుకంటే టీమ్‌‌లోకి రావాలంటే అద్భుతాలు సృష్టించాల్సిందే’ అని డబుల్‌‌ సెంచరీ హీరో మయాంక్‌‌ అగర్వాల్‌‌ చెప్పిన నగ్న సత్యం ఇది. ఇక రిజర్వ్‌‌ బెంచ్‌‌ విషయంలోనూ విరాట్‌‌ ప్లాన్స్‌‌ సూపర్‌‌. ఏ క్షణంలోనైనా, ఏ ప్లేయరైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లే టీమ్‌‌తో పాటు ఉంటారు.

పంత్‌‌ పోయి సాహా వచ్చే..

ధోనీ వారసుడిగా రిషబ్‌‌ను కోహ్లీ చాలా నమ్మాడు. అవకాశాలు కూడా ఇచ్చాడు. కానీ పంత్‌‌లో నైపుణ్యం ఉన్నా.. దానిని వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే టీమ్‌‌పై ప్రభావం చూపుతుందని భావించి.. వెటరన్‌‌ సాహాను తీసుకొచ్చాడు. ఆ చాన్స్‌‌ను అతను రెండు చేతుల్లా ఒడిసిపట్టుకున్నాడు. అంటే కష్టపడినోళ్లకు ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా చాన్స్‌‌ ఉంటుందని తెలిసేలా చేశాడు. అందుకే టీమ్‌‌లో చోటు కోసం ఎవరూ వెంపర్లాడరు. అవసరం ఉందంటే విరాట్‌‌ కచ్చితంగా పిలుస్తాడని నమ్మకం. ‘మయాంక్‌‌ అవకాశం కోసం జట్టులోకి రాలేదు. టీమ్‌‌ను గెలిపించాలని వచ్చాడు’అని యువ క్రికెటర్ల నుంచి తాను ఏం ఆశిస్తున్నాడో స్పష్టంగా చెప్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌‌ గెలిపించే పేసర్లు దొరికారన్నా, రోహిత్‌‌–మయాంక్‌‌ ద్వయం హిట్టైందన్నా, రహానె, పుజారా మిడిలార్డర్‌‌ను ఏలుతున్నారనా.. కేవలం కోహ్లీ నిర్ణయాలు, ఆటపై అతనికి ఉండే ప్యాషనే కారణం. కాంప్రమైజ్‌‌ అనే పదానికి అందనంత దూరంలో ఉండే విరాట్.. రాబోయే రోజుల్లో మరెన్ని విజయాలు
సాధిస్తాడో చూడాలి.

ఫారిన్‌‌ సిరీస్‌‌లే లక్ష్యం..

ఇండియాలో టీమిండియాకు తిరుగులేదు. కానీ విదేశాల్లో? సరిగ్గా ఇదే అంశంపై కోహ్లీ దృష్టి పెట్టి మరి సక్సెస్‌‌ అయ్యాడు. ఒక్కో మ్యాచ్‌‌లో ఒక్కో తరహా వ్యూహంతో అన్నింటిపై పట్టు సాధించాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ‘పేస్‌‌ బౌలింగ్‌‌’. ఇది మెరుగైతే తప్ప.. విదేశాల్లో సిరీస్‌‌ గెలవలేమని గ్రహించిన విరాట్‌‌.. పేసర్ల కోసం వేట మొదలుపెట్టాడు. అలా చేసిన వేటలో దొరికిన స్టార్‌‌ బుమ్రా. ఓ ఎండ్‌‌లో అతను విశేషంగా రాణించినా.. రెండో ఎండ్‌‌లో వికెట్లు తీసే నాణ్యమైన పేసర్‌‌ కావాలి. అలా షమీ, భువనేశ్వర్‌‌, ఇషాంత్‌‌, ఉమేశ్‌‌.. అందర్ని పరీక్షించాడు. దీనికితోడు నమ్మిన ఆటగాళ్ల కోసం, పనికొస్తాడని భావించిన ప్లేయర్ల కోసం బోర్డుతో, సెలెక్షన్‌‌ కమిటీతోనూ పోరాడేందుకు సిద్ధమయ్యాడు. దీనివల్ల కోహ్లీ అంటే ఆటగాళ్లలో స్థైర్యం, నమ్మకం, భరోసా ఏర్పడింది. దాని ఫలితమే.. గ్రౌండ్‌‌లో వాళ్లు చూపెడుతున్న ప్రతిభ.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates