విశాక ఇండస్ట్రీస్‌కు ‘CNBC మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్-2021’ అవార్డు

విశాక ఇండస్ట్రీస్‌కు ‘CNBC మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్-2021’ అవార్డు
  • సీఎన్‌‌బీసీ ‘మోస్ట్‌‌ ట్రస్టడ్‌‌ బ్రాండ్స్‌‌–2021’ అవార్డ్‌‌ దక్కించుకున్న కంపెనీ 
  • కంపెనీ షేరుపై పాజిటివ్‌‌గా బ్రోకరేజి కంపెనీలు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: సిమెంట్ రేకుల తయారీ నుంచి వివిధ బిజినెస్‌‌లలో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌‌, ఈ ఏడాది మోస్ట్​ ట్రస్టెడ్​ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ‘సీఎన్‌‌బీసీ మోస్ట్‌‌ ట్రస్టడ్‌‌ బ్రాండ్స్‌‌–2021’ అవార్డ్‌‌ను దక్కించుకుంది. క్లాత్స్‌‌, ఆటోమొబైల్‌‌, వెహికల్ కాంపోనెంట్‌‌, ఫుడ్ బెవరేజెస్‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌, ఎఫ్‌‌ఎంసీజీ వంటి 11 సెక్టార్లకు చెందిన బ్రాండ్స్‌‌కు ఈ అవార్డ్స్‌‌ను ఇచ్చారు. బాలీవుడ్‌‌ యాక్టర్‌‌‌‌ వివేక్‌‌ ఒబెరాయ్‌‌ నుంచి ఈ అవార్డ్‌‌ను విశాక ప్రతినిధులు అందుకున్నారు. మోస్ట్‌‌ ట్రస్టెడ్‌‌ బ్రాండ్‌‌గా నిలిచినందుకు ఆనందంగా ఉందని కంపెనీ ట్విటర్‌‌‌‌లో పేర్కొంది.‘ క్వాలిటీని అందించాలనేది మన గోల్‌‌ అయితే గుర్తింపు ఆటోమెటిక్‌‌గా వస్తుంది. కస్టమర్లు మాపై చూపుతున్న నమ్మకానికి ఆనందంగా ఉంది. ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటాం’ అని అవార్డ్‌‌ దక్కడంపై వినెక్స్ట్‌‌ ట్విటర్‌‌‌‌లో పేర్కొంది.
విశాకపై పాజిటివ్‌‌గా బ్రోకరేజి కంపెనీలు..
విశాక ఇండస్ట్రీస్ షేరుపై బ్రోకరేజి కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌  ‘కొనొచ్చు’ రికమండేషన్‌‌ను  కొనసాగిస్తోంది. అస్బెస్టాస్‌‌ సిమెంట్‌‌ షీట్ల(ఏసీఎస్‌‌) సెగ్మెంట్‌‌లో గ్రోత్‌‌ కనిపిస్తుండడంతో, విశాక ఎక్కువగా లాభపడుతుందని ఈ కంపెనీ అంచనావేస్తోంది. దీనికి తోడు ఫైబర్ బోర్డులను తయారు చేసే వీనెక్స్ట్‌‌ బిజినెస్‌‌, ఏసీఎస్‌‌ బీజినెస్‌‌లు తిరిగి కరోనా ముందు స్థాయిలకు చేరుకోవడంతో కంపెనీ షేరుపై పాజిటివ్‌‌గా ఉంది. విశాక ఇండస్ట్రీస్‌‌ షేరు శుక్రవారం రూ. 471.60 వద్ద  క్లోజయ్యింది. ఈ షేరు వాల్యూ రూ. 705 వరకు పెరగొచ్చని అంచనావేసింది. ముందు ఈ టార్గెట్ ధర రూ. 617 గా ఉండేది.  దీనిని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ సవరించింది.  విశాక ఇండస్ట్రీస్‌‌కు చెందిన టెక్స్‌‌టైల్ బిజినెస్‌‌ కూడా 85 శాతం కెపాసిటీతో పనిచేస్తోందని ఐసీఐసీఐ రిపోర్ట్‌‌ తెలిపింది. రూరల్‌‌ ఏరియాలలో ఏసీఎస్‌‌కు డిమాండ్ పెరుగుతోందని, ఏసీఎస్‌‌ ఇండస్ట్రీ వాల్యూమ్స్‌‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3 లో 5 శాతం పెరగగా, విశాక వాల్యూమ్స్‌‌ 10 శాతం పెరిగాయని ఈ రిపోర్ట్‌‌ పేర్కొంది. మరో బ్రోకరేజి కంపెనీ ఆనంద్ రాఠి కూడా విశాక షేరుపై ‘కొనొచ్చు’ రికమండేషన్‌‌ను కొనసాగిస్తోంది. విశాక షేరు రూ. 572 వరకు పెరగొచ్చని అంచనావేసింది.  

2022 చివరినాటికి అప్పుల్లేని కంపెనీగా
ఆర్థిక సంవత్సరం 21–2022లో విశాక ఇండస్ట్రీస్‌‌కు చెందిన ఏసీఎస్‌‌, వీనెక్స్ట్‌‌ సెగ్మెంట్‌‌ల రెవెన్యూ డబుల్ డిజిట్‌‌ గ్రోత్‌‌ను నమోదు చేస్తాయని, సింథటిక్ దారాలను తయారు చేసే బిజినెస్‌‌ తిరిగి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటుందని ఐసీఐసీఐ రిపోర్ట్‌‌ అంచనావేసింది. ప్రస్తుతం కంపెనీ నికర అప్పులు రూ. 70 కోట్లుగా ఉన్నాయని, గ్రాస్‌‌ అప్పులు రూ. 167 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2022 చివరి నాటికి అప్పుల్లేని కంపెనీగా విశాక మారుతుందని అంచనావేసింది.  వీనెక్స్ట్‌‌ ప్రీమియం కేటగిరీ బోర్డుల ఎగుమతులు పెరిగాయని పేర్కొంది. కోయంబత్తూర్‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్న వీనెక్స్ట్‌‌ బోర్డు తయారీ ప్లాంట్ ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో ప్రారంభమవ్వొచ్చని తెలిపింది. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 50 వేల టన్నుల బోర్డులు, 10 వేల టన్నుల ప్యానెల్స్‌‌.