త‌క్ష‌ణం రూ.50 కోట్లు క‌ట్టండి: ఎల్జీ పాలిమ‌ర్స్ కు ఎన్జీటీ ఆదేశం

విశాఖపట్నంలో జ‌రిగిన ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ విష వాయువుల లీకేజీ ఘ‌ట‌న‌పై నేష‌నల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సీరియ‌స్ అయింది. దీనిపై సుమోటోగా కేసు స్వీక‌రించి.. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌, సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు, ఏపీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు, ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘ‌ట‌న‌పై మే 18లో త‌మ రెస్పాన్స్ తెలిపాల‌ని ఆదేశించింది. గురువారం తెల్ల‌వారుజామున గ్యాస్ లీకేజీ కార‌ణంగా జ‌రిగిన ప్ర‌జ‌లు, జీవాల ప్రాణ న‌ష్టంతో పాటు ప‌ర్యావ‌రణానికి జ‌రిగిన హానిని దృష్టిలో పెట్టుకుని ప్రాథ‌మిక ప‌రిహారం కింద త‌క్ష‌ణం రూ.50 కోట్లు డిపాజిట్ చేయాల‌ని ఎల్జీ పాలిమ‌ర్స్ ను ఆదేశించింది ఎన్జీటీ.

ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ

క‌రోనా లాక్ డౌన్ ఆంక్ష‌ల్లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించ‌డంతో విశాఖ‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ తిరిగి ప‌నులు మొద‌లుపెట్టిన స‌మ‌యంలో గురువారం తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌లకు స్టైరిన్ విష వాయువు లీకైంది. కొద్ది నిమిషాల్లోనే ఆర్ఆర్ వెంక‌టాపురం స‌హా ప‌లు ప్రాంతాల్లో గాలి విష‌పూరితంగా మారిపోయింది. నిద్ర‌లో ఉన్న ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఆ గ్యాస్ కార‌ణంగా క‌ళ్లు, చర్మం మంట‌ల‌తో మెలకువ వ‌చ్చి.. ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌రుగులు తీశారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం అందిన వెంట‌నే స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది క‌లిసి వేగంగా ప్ర‌జ‌ల్ని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వంద‌లాది మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది మ‌ర‌ణించారు. అందులో కొంత మంది ఆ విష వాయువుల నుంచి త‌ప్పించుకుని దూరంగా ప‌రిగెత్తుతున్న స‌మ‌యంలోనే ఎక్క‌డిక‌క్క‌డ కుప్ప‌కూలి ప్రాణాలు వ‌దిలారు. ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ఆర్సీ), నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) సుమోటోగా ద‌ర్యాప్తున‌కు స్వీక‌రించాయి.

ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఈ దుర్ఘ‌ట‌న జ‌ర‌గడానికి కార‌ణాలు, గ్యాస్ లీకేజీకి బాధ్యులు ఎవ‌రు, ఎక్క‌డ లోపం జ‌రిగింది, ప్రాణ న‌ష్టం, ప‌ర్యావ‌ర‌ణానికి జ‌రిగిన హాని తీవ్ర‌త గురించి విచార‌ణ జ‌రిపేందుకు ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించింది. ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శేషశయన రెడ్డి నేతృత్వంలో ఈ క‌మిటీ విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ వి.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పులిపాటి కింగ్, సీపీసీబీ సభ్య కార్యదర్శి, నీరి హెడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ ఈ క‌మిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి మే 18 లోపు ఈ-మెయిల్ ద్వారా నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ధ‌ర్మాస‌నం సూచించింది. ఆ రోజున మ‌ళ్లీ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Latest Updates