అరణ్య భవన్ ముట్టడి: విశ్వబ్రాహ్మణ, సా మిల్లర్ల ఆందోళన

అటవీశాఖ అధికారులు నిబంధనలతో వేధిస్తున్నారంటూ విశ్వబ్రాహ్మణ మనమయ సంఘం, టింబర్స్ మర్చంట్స్, సామిల్లార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరణ్య భవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణ అంతటా అన్ని జిల్లాల నుండి వందలాదిగా.. హైదరాబాద్ సైఫాబాద్ లోని అరణ్య భవన్ కు తరలివచ్చారు. సెక్రటేరియట్ నుంచి ర్యాలీగా వచ్చిన వడ్రంగి కార్మికులను.. పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకోవడంతో.. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బ్యారికేడ్లను తొలగించి… అరణ్య భవన్ వైపు దూసుకెళ్ళిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు పంపించారు.

మూడు రోజులుగా బంద్ పాటించి నిరసన తెలుపుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ప్రతినిధులు. అటవీ శాఖ అధికారుల వేధింపుల కారణంగా కొందరు వడ్రంగి కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 55 వల్ల అనేక మంది చేతి వృత్తిదారులు ఉపాధిని కోల్పోతున్నారని…వెంటనే ఈ జీవో ను రద్దు చెయ్యకపోతే తమ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

Latest Updates