తిరుమలలో డిసెంబర్ 5నుంచి వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్ 5వ తేదీ నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్ధం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠం, తిరుచానూరు ఆలయంలోని సూర్యప్రభ వాహనానికి బంగారు తాపడం చేయించనున్నట్లు చెప్పారు. నడక దారిలోని గోపురాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించామన్నారు. అంతేకాదు తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని మండలి సమావేశంలో తీర్మానించామన్నారు. అనాధ పిల్లల కోసం TTD నిర్వహిస్తున్న బాల మందిరంలో రూ.10 కోట్లతో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అన్ని జిల్లా కేంద్రాల్లో శ్రీవారి కల్యాణం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

అంతేకాదు TTD ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఆస్తుల వివరాలను తెలుపుతామన్నారు.TTD ఆస్తులకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి, పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే కొనసాగించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీ బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని కూడా వేసినట్లు తెలిపారు TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

Latest Updates