ఉద్యమకారులైన దళితులను కేసీఆర్ మోసం చేశారు : వివేక్ వెంకటస్వామి

vivek-fires-on-cm-kcr-in-khammam-district

ఖమ్మం : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళితులను కేసీఆర్ మోసం చేసారని అన్నారు మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. నేలకొండపల్లి (మం) చెరువు మాధారంలో మాలపల్లి- మాల మహానాడు ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహవిష్కణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో వివేక్ మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడితో తెలంగాణ రాలేదనీ… తెలంగాణ ఎంపీల కృషి ఫలితమే నేటి సొంత రాష్ట్రమని చెప్పారు వివేక్.

సంక్షేమ పథకాల అమలు జరగడం లేదని ప్రశ్నించినందుకే తనపై కేసీఆర్ కక్ష కట్టారని అన్నారు వివేక్. దళితులను అణగదొక్కేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో దళితులకు న్యాయం జరగదని అన్నారు. దళితులకు రుణాలు అందడం లేదని … రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని చెప్పి మాట మార్చారని చెప్పారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా పొందిన సమాచారం ప్రకారం.. 5 వేల మంది దళితులకే 3 ఎకరాల భూమిని ఇచ్చారనీ… ఇంకా లక్షల మందికి ఇవ్వాల్సి ఉందని చెప్పారు వివేక్.

ప్రాజెక్టుల పేరుతో కమీషన్ లు దోచుకుని ఎన్నికలలో ఓటర్లకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. కొడుకు, బిడ్డ కోసమే కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. కప్పు, సాసర్ లు తీసేటోళ్లకు…, మోసేటోళ్లకు మాత్రమే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు వివేక్.

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన వివేక్.. జాతి నిర్మాత అన్ని వర్గాల ప్రజల కోసం రాజ్యంగం రాశారనీ… దళిత జాతి అభ్యున్నతి కోసం పరితపించారని చెప్పారు వివేక్ వెంకటస్వామి.