
సంగారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ కమీషన్ల రూపంలో దోచుకున్న రూ.లక్ష కోట్లన ప్రజా ధనాన్ని తాము అధికారంలోకి రాగానే కక్కిస్తామని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆ లక్ష కోట్ల కమీషన్లను రాష్ట్ర ఖజానాకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు రూ.60 వేల కోట్లు ఉన్న అప్పును రూ.4 లక్షల కోట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మండిపడ్డారు. ఆయన దోపిడీ వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన వివేక్ మీడియాతో మాట్లాడారు. వరుస ఓటములతో కేసీఆర్ ఇప్పుడిప్పుడే సోయిలోకి వస్తుండని, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో వివిధ పథకాలపై యూటర్న్ తీసుకొని రివ్యూలు చేస్తున్నారన్నారు. కరోనా టైంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఉండుంటే రాష్ట్రంలో ఎంతో మంది పేదలకు ఉపయోగపడేదన్నారు. కానీ అప్పుడు అమలు చేయకుండా ప్రైవేటు హాస్పిటళ్లతో కుమ్మక్కై పేదలను దోచుకున్నారని విమర్శించారు. సాగర్ బైఎలక్షన్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరంతోనే సంపన్నుల లిస్ట్‌లో మేఘా
కాళేశ్వరం కాంట్రాక్టుతోనే మేఘా కృష్ణారెడ్డి దేశంలో సంపన్నుల లిస్ట్‌లో చేరారని వివేక్ చెప్పారు. కేసీఆర్ ఆయన ఫ్యామిలీ, అనుచరులు కలిసి గచ్చిబౌలిలో 2వేల ఎకరాల్లో పాగా వేశారని ఆరోపించారు. ప్రాజెక్టులపై కమీషన్ల రూపంలో సీఎం కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లతో పాటు దౌర్జన్యంగా ఆక్రమించిన భూములను వెనక్కి ఇస్తేనే రాష్ట్ర ఖజానా పెరిగి పబ్లిక్పై అప్పు భారం కొంత తగ్గుతుందన్నారు.
చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలి
జహీరాబాద్ సమీపంలోని నిమ్జ్ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించాలని మాజీ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించి వారికి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇప్పించాలన్నారు. అట్లనే చెరుకు రైతుల బకాయిలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు వెంటనే చెల్లించేలా చూడాలని కోరారు.