కుటుంబం కోసమే కేసీఆర్ పాలన: వివేక్ వెంకట స్వామి

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి. కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం కాకుండా బంగారు కుటుంబం కోసం పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకా వెంకటస్వామి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సాగునీటి కోసం తుమ్మిడి హెట్టి వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును తీసుకువచ్చారని అన్నారు. అయితే కేసీఆర్  ప్రాణహిత ప్రాజెక్టును పక్కకు పెట్టి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని విమర్శించారు.

తాను గొప్ప ఇంజినీర్ అనుకుని కేసీఆర్ తుమ్మిడి హెట్టి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా రావాల్సిన నీటిని లక్షలు ఖర్చుపెట్టి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి పోస్తున్నారని అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా కాలేశ్వరం నీటిని ఎల్లంపల్లికి తరలించి అదే నీటిని దిగువకు విడుదల చేయడం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమన్నారు.

రూ. 30 వేల కోట్లతో కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించకుండా  కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల ప్రజా ధనాన్ని సీఎం కేసీఆర్ వృధా చేస్తున్నారని విమర్శించారు.  రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్ కు హెచ్చరిక పంపాలన్నారు.

Latest Updates