రైతులను మోసం చేస్తున్న సీఎం

ఆయన దృష్టంతా కమీషన్లు, ఓట్ల మీదే: మాజీ ఎంపీ వివేక్​

హయత్ నగర్, వెలుగు: ‘‘ఉద్యమ సమయంలో రైతులందరినీ కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కేసీఆర్​.. ఆ మాటను విస్మరించి ఎట్లా కమీషన్ లు కొట్టాలి, ఎట్లా ఓట్లు కొనాలనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు” అని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర పెంపు కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హైదరాబాద్​ ఎల్బీ నగర్  చింతలకుంటలోని ఓ గార్డెన్ లో ఆదివారం జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సంక్షేమ సమితి రెండో మహా సభ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పేరుతో వారిని మోసం చేసి ఓట్లను దక్కించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నామన్నారు. జస్టిస్ చంద్రకుమార్​ మాట్లాడుతూ.. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం చాలా బాధాకరమన్నారు. రైతు బంధు పథకంతో చిన్న, సన్నకారు రైతులకు ఏ మాత్రం మేలు జరగటం లేదని తెలిపారు. భూస్వాములకే మేలు జరిగే విధంగా ఈ పథకం ఉపయోగపడుతోందని చెప్పారు. నూటికి 60% మంది భూస్వాములు వ్యవసాయం చేయడం లేదన్నారు. రైతులను విస్మరించడం రాష్ట్రంతోపాటు దేశానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.

రైతులకు ఆర్థికసాయం

ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 30 మంది రైతులకు రూ. 10వేల చొప్పున 30 చెక్కులు పంపిణీ చేశారు. వెంకటస్వామి ట్రస్ట్ పేరిట 10 మంది రైతులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ సైంటిస్ట్ బాబూరావు, ప్రొఫెసర్ ఇటుకల పురుషోత్తం, ప్రొఫెసర్ ఈశ్వరయ్య, హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ, సాగర బేగం, కోట్ల వాసు, నల్గొండ అంజి, లింగ్య నాయక్ పాల్గొన్నారు.

Latest Updates