డిస్కంలను కేసీఆరే నాశనం చేస్తున్నరు

 

  •     కొత్త విద్యుత్​ బిల్లుపై సీఎంది తప్పుడు ప్రచారం
  •     కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నాలు
  •    మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్రంలోని డిస్కంలను సీఎం కేసీఆరే నాశనం చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్​ కమిటీ మెంబర్​ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. డిస్కంలకు ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని, రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. రూ.5 కోట్లే ఇస్తున్నారని, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో అన్ని డిస్కంలు వేల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోతున్నాయని చెప్పారు.కొత్త విద్యుత్​ సవరణ బిల్లుపై రాష్ట్ర  ప్రజలకు అబద్ధాలు చెపుతూ, కేంద్రాన్ని బద్నాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ బిల్లుతో ప్రజలకు లాభమేనని, నష్టం లేదన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈఆర్​సీలో కేసీఆర్​ కుటుంబ సభ్యులనే నియమించారు

కరెంట్​ సబ్సిడీ నిధులను సీఎం కేసీఆర్  ఇరిగేషన్​ ప్రాజెక్టులకు డైవర్ట్ చేస్తూ కమీషన్ల దందా చేస్తున్నారని, కొత్త విద్యుత్ చట్టం వస్తే ఇవి బంద్ అవుతయన్న భయం కేసీఆర్ లో ఉందని వివేక్​ చెప్పారు. వ్యవసాయ మీటర్లు పెట్టాలని, సబ్సిడీ ఇవ్వబోమని కేంద్రం చెబుతోందంటూ సీఎం అంటున్నారని, కానీ, ఆ బిల్లులో మీటర్లు పెట్టాలన్న మాట ఎక్కడా లేదని ఆయన అన్నారు.  ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ నేరుగా ప్రజలకు ఇవ్వాలని బిల్లులో పెట్టారని చెప్పారు. మూడేండ్లుగా రాష్ట్రంలో ఈఆర్ సీ నియామకం జరగలేదని, ఇటీవల ఏర్పాటు చేసినా కేసీఆర్  కుటుంబ సభ్యులనే ఈఆర్ సీలో నియమించారని ఆరోపించారు. ఇండిపెండెంట్ రెగ్యులేటరీగా ఈఆర్ సీ ఉండాలని బిల్లులో ఉందన్నారు. ప్రజలకు సరైన కరెంట్ బిల్లు రావాలనేది కేంద్రం ఉద్దేశమని చెప్పారు. దీని వల్ల వినియోగదారులకు లాభం కలుగుతుందని, డిస్కంలు కూడా బాగా నడుస్తయని, బిల్లు ఎక్కువొస్తే ఈఆర్ సీని అడిగే హక్కు వినియోగదారులకు ఉంటుందని అన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారాలు మానాలని ఆయన హితవు చెప్పారు.

డిస్కంల అప్పులను  కేంద్రమే తీర్చింది

కొత్త విద్యుత్​ బిల్లు సరైనది కాదని, రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎం తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారని వివేక్​ ఆరోపించారు. ‘‘డిస్కంల ఇబ్బందులు తొలగించి ప్రజలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ బిల్లు తెస్తోంది. మూడేండ్ల క్రితమే ఉదయ్  స్కీంతో రూ.10 వేల కోట్ల డిస్కంల అప్పులను కేంద్ర ప్రభుత్వం తీర్చింది. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిధులు ఇవ్వకపోవటంతో డిస్కంలు నష్టాల్లోకి వెళుతున్నాయి. రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్న సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా డిస్కంలకు ఇస్తోంది. అందువల్ల ఎల్ పీజీ సబ్సిడీ ఇచ్చినట్లుగా కరెంట్ సబ్సిడీ నిధులను జనం బ్యాంక్​ అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్​ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది”అని వివేక్​ చెప్పారు. సింగరేణి పవర్ ప్లాంట్ కరెంట్ ను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు మాత్రం ఇవ్వటం లేదన్నారు.

Latest Updates