వొడాఫోన్‌ ఐడియా వర్కవుట్​ కాలే

    మొత్తం ఆదాయం రూ.11,269 కోట్లు

    32 కోట్లకు పడిపోయిన కస్టమర్ల సంఖ్య

    రూ.108కి చేరిన ఏఆర్‌పీయూ

ఇండియాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్‌‌ ఐడియా ఈ ఏడాది జూన్‌‌తో ముగిసిన తొలి క్వార్టర్‌‌కుగానూ రూ.4,873 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మార్చి క్వార్టర్‌‌లో రూ.4,881 కోట్ల నష్టాలు రాగా, డిసెంబరు క్వార్టర్‌‌లో రూ.5,004 కోట్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో ఆదిత్య బిర్లాగ్రూపునకు చెందిన, వొడాఫోన్‌‌ విలీనం కావడం తెలిసిందే. అయితే 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ఉమ్మడి లక్ష్యాలను చేరుకుంటామని కంపెనీ ప్రకటించింది. అయితే విలీనం గత ఏడాది ఆగస్టులో జరిగినందున ఈ ఫలితాలను గత ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌ ఫలితాలతో పోల్చిచూడొద్దని కంపెనీ సూచించింది. కన్సాలిడేటెడ్‌‌ ప్రాతిపదికన ఆదాయం క్వార్టర్‌‌వారీగా 4.3 శాతం తగ్గి రూ.11,269 కోట్లకు చేరుకుంది. మార్చి క్వార్టర్‌‌లో ఇది రూ.11,775 కోట్లుగా నమోదయింది.

సిమ్‌‌ వ్యాలిడిటీ పెంపు కోసం యూజర్లు పెద్ద ఎత్తున రీచార్జ్‌‌లు చేయించుకోవడంతో ఆదాయం పెరిగింది. నెట్‌‌వర్క్‌‌ విస్తరణ, ఐటీ ఔట్‌‌సోర్సింగ్‌‌ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు కొనసాగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది జూన్‌‌లో కంపెనీకి 33.41 కోట్ల కస్టమర్లు ఉండగా, తాజా క్వార్టర్‌‌లో వీరి సంఖ్య 32 కోట్లకు తగ్గింది. సర్వీస్‌‌ వాలిడిటీ వోచర్ల విధానం తీసుకురావడం వల్ల చాలా మంది నెట్‌‌వర్క్‌‌ను వీడారని పేర్కొంది. ఈ క్వార్టర్‌‌లో రూ.229, రూ.255 రీచార్జ్‌‌లు ప్రవేశపెట్టామని, వీటిలో రోజూ 2జీబీ, 2.5జీబీ డేటా వస్తుందని కంపెనీ తెలిపింది. దీనివల్ల ఏఆర్‌‌పీయూ పెరుగుతుందని తెలిపింది.

పెరిగిన ఇబిటా

నిర్వహణ ఆదాయం లేదా వడ్డీ, పన్నులు, తరుగు, నగదీకరణ తరువాత ఆదాయం (ఇబిటా) మార్చి క్వార్టర్‌‌లో రూ.1,785 కోట్లు కాగా, జూన్‌‌ క్వార్టర్‌‌లో ఇది రూ.3,650 కోట్లకు చేరింది. ఇండ్‌‌ ఏఎస్‌‌ 116 అకౌంటింగ్‌‌ విధానానికి మారడం వల్ల రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని కంపెనీ తెలిపింది. ఐడియాకు యూజర్‌‌ నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌‌పీయూ) జూన్‌‌ క్వార్టర్‌‌లో రూ.108కి పెరిగింది. ఇంతకుముందు క్వార్టర్లో ఇది రూ.104 ఉండేది. ఫలితాలపై వొడాఫోన్‌‌ ఐడియా సీఈఓ బాలేశ్‌‌ శర్మ మాట్లాడుతూ తమ వ్యూహాలను చేస్తున్నామని, ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు. జూన్‌‌ క్వార్టర్‌‌లో రైట్స్‌‌ ఇష్యూ ద్వారా వాటాదారుల నుంచి కంపెనీ విజయవంతంగా రూ.25 వేల కోట్లను సమీకరించింది. ఈ ఏడాది జూన్‌‌ వరకు కంపెనీ స్థూల అప్పులు రూ.1.20 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో స్పెక్ట్రం కోసం చెల్లించాల్సిన రూ.89,180 కోట్లు ఉన్నాయి. నగదు నిల్వలు రూ.21,180 కోట్లు ఉన్నాయి. వీటిని మినహాయిస్తే  నికర అప్పు రూ.99,260 కోట్లు అవుతుంది.   వొడాఫోన్‌‌ ఐడియా షేర్లు బీఎస్‌‌ఈలో శుక్రవారం 4.12 శాతం నష్టపోయి రూ.9.30 వద్ద ముగిశాయి.

–బాలేశ్‌‌ శర్మ,
సీఈఓ, వొడాఫోన్ ఐడియా సీఈఓ

Latest Updates