వొడాఫోన్ ఐడియా మెరిసింది

వొడాఫోన్ ఐడియా మెరిసింది

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియాకు చెందిన బ్యాంక్‌ గ్యారంటీలను, ప్రభుత్వం డబ్బుగా మార్చుకోదనే వార్తలు రావడంతో బుధవారం సెషన్‌లో ఈ కంపెనీ షేరు 48 శాతానికి పైగా లాభపడింది. వ్యవస్థలో మూడు టెలికాం కంపెనీలూ కొనసాగేందుకు ఉన్న అవకాశాలపై టెలికాం, ఫైనాన్స్‌ మినిస్ట్రీ అధికారులు, కేబినేట్‌ సెక్రటరీ రాజివ్‌ గౌబాను కలిసి చర్చించారని వార్తలు  వెలువడ్డాయి. ఇది కూడా వొడాఫోన్‌ ఐడియా షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు 48.18 శాతం పెరిగి రూ. 4.49 ని స్థాయిని తాకింది. చివరికి 38.28 శాతం లాభంతో రూ. 4.19 వద్ద ముగిసింది. ఏజీఆర్‌‌ బకాయిలను చెల్లించడంలో టెలికాం కంపెనీలకు కొంత ఫ్లెక్సిబిలిటి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని టెలికాం అధికారి ఒకరు చెప్పారు. దీనికి సంబంధించి మొదటి రౌండ్‌ సమావేశాలు మంగళవారం జరిగాయని తెలిపారు. బ్యాంక్‌ గ్యారెంటీలను డబ్బుగా మార్చుకుంటే, అది ఆ కంపెనీ టెలికాం లైసెన్స్‌ రద్ధుకు దారితీస్తుందని అన్నారు. వొడాఫోన్‌ ఐడియా చైర్మన్‌ కుమార్‌‌ మంగళం బిర్లా వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవిందర్‌‌ టక్కర్‌‌తో కలిసి  టెలికాం సెక్రటరీ అన్సూ ప్రకాశ్‌ను మంగళవారం కలిశారు.