రూ.3,354 కోట్లు కట్టిన వొడాఫోన్‌‌ ఐడియా

న్యూఢిల్లీ: అడ్జెస్టెట్‌ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్‌) బకాయిల ప్రిన్సిపల్ చివరి వాయిదా మొత్తం రూ.3,354 కోట్లను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డాట్‌)కు చెల్లించామని వొడాఫోన్‌ ఐడియా సోమవారం తెలిపింది.  గత నెల 17న వొడాఫోన్‌ ఐడియా రూ.2,500 కోట్లు, అదే నెల 20న మరో రూ.వెయ్యి కోట్లు చెల్లించింది. తాజా చెల్లింపులను కలిపితే మొత్తం రూ.6,854 కోట్లు అవుతుందని, ప్రిన్సిపల్‌ ఏజీఆర్‌ బకాయిలను పూర్తిగా చెల్లించామని కంపెనీ వివరణ ఇచ్చింది. తాము డాట్‌కు ఏజీఆర్‌ బకాయిలుగా రూ.21,533 కోట్లు బాకీ ఉన్నామని తెలిపింది. ఇందులో అసలు మొత్తం రూ.6,854 కోట్లని పేర్కొంది. ఈ విషయంలో డాట్‌ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయి. వొడాఫోన్‌ ఐడియా రూ.53 వేల కోట్లు చెల్లించాలంటూ డాట్‌ గతంలో నోటీసులు పంపింది.

20 ఏళ్ల గడువు ఇవ్వండి..

ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న టెల్కోలకు ఊరట కలిగించేలా.. బకాయిల చెల్లింపునకు 20 ఏళ్ల విండో పీరియడ్‌ సదుపాయం కల్పించాలని డాట్‌ సుప్రీంకోర్టును కోరింది. టెలికం, నాన్‌–టెలికం కంపెనీల నుంచి తమకు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు రావాలని డాట్‌ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తీర్పు తరువాత కాలానికి ఏజీఆర్‌ బకాయిల ప్రిన్సిపల్‌ మొత్తానికి వడ్డీ, పెనాల్టీ వేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే అంతకుముందు బకాయిల చెల్లింపునకు యథావిధిగా ఎనిమిది శాతం వడ్డీ వసూలు చేస్తామని వివరించింది.

వొడాఫోన్‌ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

వన్‌ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను (ఓటీఎస్‌సీ) విధించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో వొడాఫోన్‌ ఐడియా వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ‘ఏ బకాయిలూ కట్టకండి’ అంటూ మండిపడింది. ఓటీఎస్‌సీలను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏజీఆర్‌‌ కేసుకు దీంతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ కోర్టుకు తెలిపింది.  ఓటీఎస్‌సీపై టెలికాం డిస్‌ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ అప్పిలేట్ ట్రిబ్యునల్‌(టీడీఎస్‌ఏటీ) గతంలో టెల్కోలకు అనుగుణంగా తీర్పిచ్చింది. ఈ నిర్ణయంపై డాట్ సుప్రీంకోర్టులో చాలెంజ్‌ చేసిన  విషయం తెలిసిందే. తాజాగా వొడాఫోన్‌ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టేసింది. వెళ్లింది.

Latest Updates