స్ట్రాంబోలి ద్వీపంలోని అగ్నిపర్వతం పేలింది

ఇటలీలోని స్ట్రాంబోలి ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. లోకల్‌‌ టైం ప్రకారం మధ్యాహ్నం 2.46 (ఇండియన్‌‌ టైం ప్రకారం సాయంత్రం 6.16)కు పర్వతం రెండు సార్లు బద్దలైంది. దీంతో మాగ్మా ఒక్కసారిగా బయటకు వచ్చింది. పర్వతం చుట్టుపక్కలున్న చెట్లు, పొదలు కాలిబూడిదై పోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర బూడిద, పొగ ఆకాశాన్ని కమ్మేశాయి. సిసిలీకి చెందిన ఓ వ్యక్తి స్ట్రాంబోలి పర్వతాన్ని ఎక్కుతుండగానే పేలింది. ఓ రాయి వచ్చి మీద పడి చనిపోయారు. ఆయనతో పాటు వెళ్లిన మరో వ్యక్తి (బ్రెజిలియన్‌‌)ని రెస్క్యూ టీం కాపాడింది. ఆ ద్వీపానికి సరదాగా గడిపేందుకు వచ్చిన చాలా మంది టూరిస్టులు లావా ఎక్కడ మీద పడుతుందేమోనని భయంతో సముద్రంలో దూకారు. టూరిస్టులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెంటనే నేవీ బోట్లను పంపారు. ఇప్పటికే 70 మంది టూరిస్టులు, స్థానికులను తరలించారు.

1932 నుంచి..

స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చెబుతున్నారని, జనాలున్న ప్రాంతాల్లో నష్టం జరగలేదని సమాచారం అందిందని అధికారులు చెప్పారు. ఇటలీలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఇదీ ఒకటని, 1932 నుంచి పేలుతూనే ఉందని, కానీ బుధవారం నాటి పేలుడు చాలా తీవ్రమైందని వివరించారు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం వచ్చి మీద పడినట్టు భయమేసిందని స్థానికుడు లోంగో చెప్పారు. కొందరు టూరిస్టులు బుధవారమే స్ట్రాంబోలి దగ్గరకు వెళ్దామనుకున్నారని, కానీ గురువారానికి వాయిదా వేసుకున్నారని, లేదంటే ఏమయ్యేదో ఊహించడానికే కష్టంగా ఉందని మరో టూరిస్టు చెప్పారు.

2002లో ఆరుగురికి గాయాలు

స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యదరా లైట్‌‌ హౌజ్‌‌ అంటుంటారు.  సముద్ర మట్టం నుంచి కిలోమీటర్‌‌ ఎత్తులో ఉంది. 12 చదరపు కిలోమీటర్లున్న ఈ పర్వత ప్రాంతంలో సుమారు 500 మంది ఉంటున్నారు. వీళ్లకు టూరిస్టుల వల్లే ఆదాయం వస్తుంటుంది. ఇంతకుముందు 2002 డిసెంబర్‌‌లో ఇలాంటి పేలుడు జరిగింది. అగ్నిపర్వతం నుంచి మాగ్మా సముద్రంలో పడటంతో పెద్ద పెద్ద అలలొచ్చాయి. ఆరుగురు గాయపడ్డారు.

హవాయిలో అలర్ట్‌‌…

స్ట్రాంబోలి బద్దలవడంతో అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలోని అగ్నిపర్వతాలకు యెల్లో అలర్ట్‌‌ సిగ్నల్‌‌ జారీ చేశారు. వాల్కనోస్‌‌కు ‘యెల్లో’ రెండో ప్రమాద హెచ్చరిక. ప్రపంచంలోని అతి పెద్ద అగ్నిపర్వతం మౌనలోవా (హవాయి)కు కూడా ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భూమిలో ప్రకంపనలు పెరిగి మౌనలోవాలో ఉన్న మాగ్మాపై ఒత్తిడి పెరుగుతోందని స్థానిక అధికారులు అంటున్నారు. ఇది చివరగా 1984లో పేలింది. 1843 నుంచి 33 సార్లు బద్దలైంది. వారంలో 75 వరకు భూకంపాలు ఈ పర్వత ప్రాంతంలో వస్తుంటాయి. అప్పుడప్పుడు అక్కడి భూమి ఉబ్బుతుంటుంది. అయితే ఇప్పటికిప్పుడు మౌనలోవా పేలే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

Latest Updates