పేలడానికి రెడీగా ఉన్న అగ్ని పర్వతాలు

గుండెలపై కుంపట్లు

ఫిలిప్పీన్స్ లో తాల్ అగ్ని పర్వతం పేలడానికి రెడీ అవుతోంది. ఈ పర్వతం గడచిన 450 ఏళ్లలో కనీసం 34సార్లు పేలిం దని చెబుతున్నా… ఎన్నడూ లేని రేంజ్ లో శబ్దాలు, బూడిద ఎగసి పడుతోంది. గ్లోబ్ లో దాదాపు 1500 అగ్ని పర్వతాలున్నాయి. గతంలో పేలి జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చేసినవి కొన్నైతే, ఎప్పుడో ఒకప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్నవి మరికొన్ని. ప్రపంచ జనాభా గుండెల మీద కుంపట్లుగా ఉండే ఈ అగ్ని పర్వతాల్లో వెలకట్టలేని నిక్షేపాలు కూడా ఉన్నాయి.

ప్రకృతి అంతుబట్టని సెల్ఫ్ మెకానిజంతో పనిచేస్తుంది. వాతావరణంలో సడెన్‌గా వచ్చే మార్పుల్ని గమనిస్తూ… తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు, హైదరాబాద్‌లో వరుసగా ఓ నాలుగైదు రోజులు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయిందంటే, కచ్చితంగా వాన పడుతుంది. అలాగే, అగ్ని పర్వతాల పేలుడు వెనుకకూడా సైంటిఫిక్ కరెక్టివ్ మెజర్స్ ఉంటాయంటారు. అగ్నిపర్వతం పేలినప్పుడు పైకి ఎగజిమ్మే దుమ్ము ధూళిలో సల్ఫర్ కణాలు ఉంటాయని, అవి భూమి ఉపరితల వాతావరణంలోని రెండో పొర (స్ట్రాటోస్ఫియర్ )లో చేరి సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావాన్నితగ్గిస్తాయని వల్కనాలజిస్టులు చెబుతారు. అలాగే, భూగోళాన్ని చల్లబరిచే ప్రక్రియకుకూడా సాయపడతాయని అంటారు. తాజాగా ఫిలిప్పీన్స్ దేశంలో తాల్ సరస్సు‌లోని ల్యూజన్ ఐలాండ్‌లో ఉన్న తాల్ అగ్నిపర్వతం రగులుతోంది. ఇది మొట్టమొదటిసారిగా జరగడం లేదు. 1572లో మొదటి పేలుడు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి . అప్పటి నుంచి ఇప్పటివరకు గడచిన 450 ఏళ్లలో కనీసం 34 సార్లు పేలింది. పైగా ఇది ప్రపంచంలోని చిన్న అగ్ని పర్వతాల్లో ఒకటి.

దాదాపు యాభై ఏళ్ల క్రితం కొన్ని నెలలపాటు వరుసగా పేలింది. 1911లో పేలినప్పుడు 1,500 మంది వరకు చనిపోయారు. ప్రస్తుతం ఈ పర్వతం నుంచి వెలువడుతున్న బూడిద 16.8 కిలోమీటర్ల మేర ఎగసిపడుతోంది. స్ట్రాటోస్ఫియర్‌లోకి 10 కిలోమీటర్ల మేర చేరుతున్నాయని టోక్యో వల్కనిక్ యాష్ అడ్వయిజరీ సెంటర్ (వాక్ ) తెలిపింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సిటీకి 70 కిలోమీటర్ల 267 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సరస్సు లో తాల్ అగ్నిపర్వతం ఉంది. తరచు జరిగిన పేలుళ్లతో సరస్సులో చాలా వరకు లావా బూడిద నిండి ఉంటుంది. 1968లో ఈ పర్వతం నుంచి భారీ మొత్తంలో లావా పెల్లుబుకిందని తెలుస్తోంది. ప్రస్తుతం తాల్ అగ్నిపర్వతం పేలుడుతో మెరుపులు, భారీ శబ్దాలు, బూడిద ఎక్కువగా ఉన్నాయని, లావా చాలా తక్కు వ మోతాదులో వెలువడుతోందని ఫిలిప్పీన్స్ వల్కనాలజీ, సీస్మాలజీ ఇనిస్టిట్యూ షన్ (ఫివాల్క్స్) వెల్లడించింది.

తాల్ ప్రమాద హెచ్చరికను మూడో స్థాయి నుంచి నాలుగో స్థాయికి పెంచారు. దీనిని బట్టి బూడిద, రాళ్లు, గ్యాస్ వంటివి 60 కిలోమీటర్ల వేగంతో హారిజాంటల్‌గా చుట్టుపక్కల ప్రాంతాలకు విరజిమ్మే ప్రమాదం లేకపోలేదని ఫివాల్క్స్ డైరెక్టర్ రెనటో సోలి డమ్ అంచనా వేస్తున్నారు . తాల్ సరస్సులో సునామీని పుట్టించే ఛాన్స్ కూడా ఉందన్నారు . అదే గనుక జరిగితే ఆ నీరు పరిసరాల్ని ముంచెత్తేస్తుంది. అగ్నిపర్వతాల పేలుడుకు అయిదో ర్యాంక్ చాలా తీవ్రమైంది. లావా ఆ సమయంలో పైకి చాలా వేగంగా విరజిమ్ముతుం ది. ఒక కూల్ డ్రింక్ బాటిల్‌ని బాగా ఊపేసి, మూతను ఒక్కసారి తీసేస్తే ఎలాగైతే పైకి గ్యాస్ ఎగదన్నేస్తుందో… ఆ విధంగా లావా ఎగజిమ్మేస్తుంది. లావా కంటే బూడిద వల్లే ఎక్కు వగా జనం చచ్చిపోతారని హాంకాంగ్ వర్సిటీ ఎర్త్​ సైన్స్ డైరెక్టర్ జోసెఫ్ మిచాల్ స్కీ చెబుతున్నారు.

బూడిద కొన్ని వందల కిలోమీటర్ల వరకు గాలిలో ప్రయాణిస్తుంది. దానిలో ప్రమాదకరమైన టాక్సిక్ వాయువులుంటాయి. అలాగే, బూడిదతోకూడిన బురద తేమ వాతావరణం ఏర్పరుస్తుంది. పదే పదే పేలుళ్లు సంభవిస్తే కంటికి కనిపించనంత సైజులో గాజు ముక్కలుకూడా బూడిదతోపాటు గాలిలో ప్రయాణిస్తాయి. దాని ప్రభావం 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్ని పర్వతానికి 100 కిలోమీటర్ల పరిధిలో రెండున్నర కోట్ల మంది నివసిస్తున్నట్లు అంచనా. ఈ లెక్కన ఆయా ప్రాంతాల్లో ఉండేవారికి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు తాల్ అగ్ని పర్వతం అంత పెను ప్రమాదస్థా యిలో పేలుతుందని చెప్పలేమని మిచాల్ స్కీ అన్నారు.

లావా పొంగి చల్లారుతుంది

గ్నిపర్వతాలు పేలినప్పుడు దానిలోని మాగ్మా చాంబర్ నుంచి కుతకుతలాడుతున్న శిలా ద్రవం (లావా) బయటకు ఎగసి పడుతుంది. ఇది దాదాపుగా 700 నుంచి 1,200 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల వరకు విపరీతమైన వేడితో ఉంటుంది. ముందుగా మాగ్మా చాంబర్ నుంచి బూడిద, గ్యాస్ వంటివి చాలా ఫోర్స్‌తో బయటకు వచ్చేస్తాయి. లావా చాలా సందర్భాల్లో పర్వతంలోని ఇతర లేయర్ల దగ్గరే ఆగిపోవడం, లేదా తనంతటతానే వత్తిడి తగ్గించుకొని చల్లారడం వంటివి జరుగుతాయి. ఈ లావాలో అనేక ఖనిజాలు, సిలికేట్ మినరల్స్ ఉంటాయి. లావాలో ఉండేవాటిల్లో పొటాషియం, సోడియం, కాల్షియంలతో కూడిన ఫెల్డ్​స్పార్స్, నవరత్నాల్లో పచ్చలుగా పేర్కొనే ఆలివిన్, మేగ్నేషియం, ఐరన్ లతో కూడిన పైరోజిన్స్, అల్యూమినోసిలికేట్‌గా చెప్పే ఆంఫిబోల్స్, మైకా, క్వార్ట్జ్ వంటివి ఉంటాయి. అగ్ని పర్వతం నుంచి ఎగజిమ్మిన లావా కాలక్రమంలో ఆయా ఖనిజాలు, సిలికేట్ మినరల్స్‌తో శిలలుగా మారిపోతుంది. సాధారణంగా లావా మందకొడిగా బయటకు వస్తుంది. గంటకు 400 మీటర్లకు మించదు. ఆ సమయంలో లోయలా ఉండే ప్రాంతంలో సరస్సు గాగానీ, లేదా డెల్టాగాగానీ ఏర్పడుతుంది. ఇది చాలా సారవంతమైన నేలవుతుందని వల్కనాలజిస్టులు చెబుతారు.

ప్రపంచంలో 1,500 అగ్నిపర్వతాలు
ప్రపంచవ్యాప్తం గా మొత్తం ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయో కచ్చితంగా లెక్క తెలీదు. అయితే 1,500 ఉన్నట్లు ఒక అంచనా. అయితే 60 నుంచి 70 అగ్నిపర్వతాలే బాగా యాక్టివ్‌గా ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మొత్తం అగ్ని పర్వతాల్లో 75 శాతం ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలోనే ఉన్నాయట. ఈ ప్రాంతాన్నే ‘ రిం గ్ ఆఫ్ ఫైర్ ’ అని
అంటారు.

మన దేశంలో ఆరు…
మనదేశంలో మొత్తం ఆరు అగ్నిపర్వతాలున్నాయి. ఇందులో ముఖ్యమై నది ‘బారెన్ ఐలాం డ్’ వల్కనో. అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయిర్‌కు 138 కిలోమీటర్ల దూరాన ఉంది ఈ అగ్నిపర్వతం. దక్షిణాసియాలోనే యాక్టివ్ అగ్నిపర్వతంగా ‘బారెన్ ఐలాం డ్ ’ కు పేరుంది. 1787లో తొలిసారి ఈ అగ్నిపర్వతం పేలినట్లు సైంటిస్టులు చెబుతారు. 150 ఏళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న ‘బారెన్ ఐలాం డ్’ 1991లో మళ్లీ పేలింది. మరోసారి ఈ పర్వతం పేలడానికి రెడీ అవుతున్నట్లు అక్కడి నుంచి సిగ్నల్స్ అందుతున్నాయి.

మిగతా ఐదు అగ్నిపర్వతాల పేర్లేమిటంటే…
నర్కోండమ్ (అండమాన్ నికోబాద్ దీవులు), బారాతంగ్ (అండమాన్ నికోబార్ దీవులు), డెక్కన్ ట్రాప్స్ (మహారాష్ట్ర), ధినోధర్ హిల్స్ (గుజరాత్), ధోసి హిల్ ( హర్యానా).

చల్లబడ్డ ‘క్యూ ఎక్సోమేట్’

ఇది మెక్సికో లోని ప్యూబ్లా లో ఉంది. ఈ అగ్నిపర్వతానికి ఒక స్పెషాలిటీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదే. 43 అడుగుల ఎత్తున ఉండే ఈ పర్వతం అనేక విడ్డూరాలకు కేరాఫ్ అడ్రస్‌గా
మారింది. చాలా ఏళ్ల కిందట ఇది బద్దలైందట. దీంతో లావా ఉవ్వెత్తున ఎగజిమ్మింది. ఇలా ఎగజిమ్మిన లావాలోని కొన్ని పదార్థాలు కలిసి పోయి గట్టిపడి ఒక కొండలా ఏర్పడ్డాయి . కొండతో పాటు క్రేటర్ (బిలం) కూడా ఏర్పడింది. ఇప్పుడిది టూరిస్ట్ స్పాట్‌గా మారింది. టూరిస్టులు మెట్లెక్కి పైకి చేరుకుని, పార్కులో టైం పాస్ చేసినట్లుగా గడుపుతారు. అగ్నిపర్వతానికి కాస్తంత దూరంలో చెట్టు చేమలు, దీని బిలంలో నీటి చెలమలు ఉండడం ఇంటరెస్టింగ్ పాయింట్.

క్రేటర్‌లో ఏర్పడ్డ జపాన్ టౌన్
ఆగిషిమా అనేది జపాన్‌లోని ఓ టౌన్. నది ఒడ్డునో, తీరాన్నో లేదు ఈ టౌన్. ఏకంగా అగ్నిపర్వతం బిలంలోనే సెటిలైంది. కొన్ని వందల ఏళ్ల కిందట పేలిపోయి చల్లబడిన ఈ అగ్నిపర్వతంతో ఎలాంటి డేంజర్ లేదు. ఆగిషిమా టౌన్‌కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. జపాన్‌లో అత్యంత తక్కువ జనాభా ఉన్న పట్టణం, ఆగిషిమానే. అసలు చల్లబడ్డ అగ్నిపర్వతం పైకి జనం ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు ఇళ్లు కట్టుకున్నారో కచ్చితంగా తెలియదు. చేపలు పట్టుకుని ఇక్కడి ప్రజలు బతికేస్తుంటారు.

వల్కనోలు 3 రకాలు

అగ్నిపర్వతాలు అన్నీ ఒకేలా ఉండవు. వాటి తీవ్రతను బట్టి మూడు రకాలుగా విడదీశారు.
మొదటి రకం ‘కాం పోజిట్’ పర్వతాలు. వీటికి పేలుడు గుణం ఎక్కు వ. జపాన్‌లోని ఫ్యూజీ అగ్నిపర్వతాలు, ఫిలిప్పీన్స్ లోని పినట్యుబో మౌంటెన్స్ అలాంటివే.

రెండో రకం ‘డార్మెం ట్ వల్కనోస్’ లేదా ‘షీల్డ్’ అగ్ని పర్వతాలు. ఎప్పుడోగానీ పేలవు. ఈ రకం అగ్నిపర్వతాల్లో పేలుడు జరిగినప్పుడు ఎగజిమ్మే లావా విపరీతమైన స్పీడుతో కొన్ని మైళ్ల దూరం వరకు ప్రవహిస్తుంది. హవాయ్ లోని మౌంట్ కిలూ అగ్నిపర్వతం ఈ జాబితాలోకి వస్తుంది.

థర్డ్ కేటగిరీ ‘డోం ’ రకం పర్వతాలు. వీటినుంచి ఎగజిమ్మే లావా చాలా చిక్కగా ఉంటుంది. దీంతో లావా ఎక్కు వ దూరం ప్రవహిం చలేదు. ఈ టైపు అగ్నిపర్వతాల్లో చాలా తక్కు వసార్లు పేలుళ్లు జరుగుతాయి.

ఇండోనేషియాలోనే ఎక్కువ పేలుళ్లు
ప్రపంచవ్యాప్తంగా అనేకసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి . ఎక్కు వగా ఇండోనేషియాలోనే ఈ పేలుళ్లు జరిగినట్లు సైంటిస్టులు చెబుతున్నారు . వీటి ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లావా ఎగజిమ్మడంతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. కాలగర్భం లో కలిసిపోయాయి.

తంబోరా పేలుడు

తంబోరా పేలుడులో 90 వేలమంది బలి. ఇండోనేషియాలోని యాక్టివ్ అగ్నిపర్వతాల్లో తంబోరా ఒకటి. 1815లో ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో 90 వేల మందికి పైగా చనిపోయారు.
క్రకోటోయా పేలి 35 వేల మంది మృతి
క్రకోటోయా, ఇండోనేషియాలోని మరో అగ్నిపర్వతం ఇది. 1883లో ఈ అగ్నిపర్వతం పేలడంతో పెద్ద ఎత్తున లావా ఎగసిపడింది. దీని తీవ్రతకు సునామీలు కూడా వచ్చాయి. ఫలితంగా 35 వేలమంది చనిపోయారు.
కరేబియాలో…
‘మౌంట్ పీలే’, కరేబియాలోని ఒక అగ్నిపర్వతం. 1902లో ఈ పర్వతం పేలడంతో 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
న్యూజిలాం డ్ పేలుడులో…
న్యూజిలాండ్ లో కిందటేడాది వైట్ ఐలాండ్ అగ్నిపర్వతం బద్దలై 24 మంది టూరిస్టులు చనిపోయారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి.

ఫ్యూజీ: అందమైన దృశ్యాల ఐకాన్

ఫ్యూజీ పేరు వినగానే కెమెరాల్లో వాడే ఫిలిం గుర్తొస్తుంది. నిజానికదో కొండ. ఫ్యూజీ అగ్నిపర్వతం జపాన్ రాజధాని టోక్యోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడాదిలో చాలా కాలం పాటు కొండ పైభాగం వైట్ కలర్ లో మెరిసిపోయే మంచు ఉంటుంది. పైన నీలాకాశం, కింద పచ్చని చెట్లు, మధ్యలో ధగధగలాడే ఫ్యూజీ మౌంటెన్. కళ్లముందు ఓ అద్భుతం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా. 12,389 అడుగుల ఎత్తుండే ఈ పర్వతాన్ని చూడటానికి ప్రపంచంలో నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. జపాన్ లోని మూడు పవిత్ర పర్వతాల్లో ఫ్యూజీ ఒకటి. ఫ్యూజీని చూసి యునెస్కో కూడా థ్రిల్లయిపోయి, 2013లో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో ఫ్యూజీ పేరు కూడా చేర్చిం ది. ఫ్యూజీ పర్వతం ఎక్కడాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు మౌంటె నీర్లు. ఇది 2000–01 మధ్య మళ్లీ పేలింది. ఫ్యూజీ వల్ల టోక్యో సిటీకి ఎప్పటికైనా డేంజర్ ఉందంటున్నారు వల్కనాలజిస్టులు.

అగ్ని పర్వతంలో…?
మాగ్మా చాంబర్: ఇది భూమిలో అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండి ఉంటుంది.
సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళ్లేది.
డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్ . ఇది సిల్ వరకు లావాని తీసుకెళ్తుంది
లావా లేయర్స్: పర్వతంలో బూడిదతో ఉంటాయి. వీటి నుం చే యాష్ వెలువడుతుంది. వీటిలో లావా చేరుతుం ది. పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు రావడం, లేదా ఎగజిమ్మడం జరుగుతుంది.
పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి కారిపోతూ ఉంటుంది.
లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా లీక్ అవుతుంది.
వెంట్: ఇది పర్వతపు కొన భాగం లేదా ముఖద్వారం. త్రోట్ నుంచి బయటకు లావాని, బూడిదను విడుదల చేసే భాగం.
క్రేటర్: వెంట్ కి చేరువలోనే ఉంటుంది. పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం.
యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెంట్ నుంచి వెలువడిన బూడిద మేఘం.

ప్రమాద హెచ్చరికలు
0 = చల్లారిన స్థితి
1 = కొంత కదలిక గుర్తిస్తారు. అయితే, పేలడానికి తక్కువ చాన్స్ .
2 = ఒక మాదిరి నుంచి పెద్ద స్థాయిలో భూకంపం. పేలుడుకు దారి తీయవచ్చు.
3 = పెద్ద స్థాయిలో పర్వతంలో కదలిక. రోజులు లేదా వారాల్లో పేలిపోయే అవకాశం. కొన్నిసార్లు తనంతట తానే చల్లారిపోవచ్చు.
4 = ఎడతెరిపి లేకుండా శబ్దాలు. రోజుల వ్యవధిలో భారీ పేలుడుకు చాన్స్
5 = ప్రమాదకర పేలుడు. పర్వతం నుంచి లావా వెలువడుతుంది లేదా ఫౌంటెన్‌లా విరజిమ్ముతుంది. బూడిద పైకి ఎగదన్నుతూ పరిసరాల్లో నిండిపోతుంది.

Latest Updates