
రేపు(మంగళవారం,డిసెంబర్-1) జరగనున్న GHMC ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. దీనికోసం కట్టుదిట్టబమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. మంగళవారం జరిగే గ్రేటర్ పోలింగ్‌కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు కల్పించినట్లు చెప్పారు. 10,500 మంది సివిల్, 3వేల మంది ఏఆర్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బందోబస్తు కల్పించామని ..సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 32 డివిజన్లు, 2, 437 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 766 సమస్యాత్మక, 250 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. 177 మొబైల్ పార్టీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కమిషరేట్ పరిధిలో 15 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీపీ. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 73 పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా 587 ప్రైవేటు ఆయుధాలను డిపాజిట్ చేయించామని, 369 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు…ప్రతి పోలింగ్ సెంటర్ ను జియో ట్యాగింగ్ చేశామన్నారు సీపీ సజ్జనార్.