సీఎం కు మా బాధ అర్థం అయ్యేలాగా ఆత్మగౌరవ మహా సభ నిర్వహిస్తాం

కొత్త రెవెన్యూ చట్టం వల్ల మాకు మేలు జరుగుతుందని అనుకున్నాం కానీ.. మా శ్రమకు గుర్తింపు దక్కలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వీఆర్వోల సంఘం అధ్య‌క్షుడు గోల్కొండ స‌తీష్. త్వరలో హైదరాబాద్ లో VRO ల ఆత్మగౌరవ మహా సభ నిర్వహిస్తామ‌ని, సీఎం కేసీఆర్ కు త‌మ‌ బాధ అర్థం అయ్యేలాగా కుటుంబాలతో మహా సభ నిర్వహిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అన్నీ జిల్లా కేంద్రాల్లో ఆత్మగౌరవ సభలు, సమావేశాలు నిర్వహిస్తామ‌ని చెప్పారు.

వీఆర్‌ఓ వ్యవస్థను ర‌ద్దు చేస్తూ ఐదు నెలల కిందట సీఎస్ చేసిన ఆదేశాలు బాధాక‌ర‌మ‌ని, అయినా అనధికారికంగా ఇంకా త‌మ‌తో పనులు చేయించుకుంటున్నారని స‌తీష్ అన్నారు. కలెక్టర్లు MRO ల మీద ఒత్తిడి తెస్తే , MRO లు త‌మ‌ మీద ఒత్తిడి చేస్తున్నారని, తాము ఇంకా ఆన్ డ్యూటీ లోనే ఉన్నామ‌ని అన్నారు. భూ సేకరణ, రైతు బంధు, కల్యాణ లక్ష్మి ఇలా అన్నీ రకాల పనులు చేస్తున్నామని, త‌మ‌కు గౌరవం, గుర్తింపు కావాలి, స్కేలు అమలు చేయాలని అన్నారు.

భూ కబ్జా దారులు కావాలనే త‌మ‌ పైన దుష్ప్రచారాలు చేశార‌ని, సమాజంలో త‌మ‌ను దోషుల్లాగా చేయాలనీ చూస్తున్నార‌ని ఆరోపించారు. తాము ప్రభుత్వానికి అన్ని వేళలా సహకరించామని, భూ ప్రక్షాళన లో మా పని తీరు చూసి సీఎం మాకు బోనస్ కూడా ఇచ్చాడని, కొంతమంది కావాలనే కుట్ర పూరితంగా మా పైన కేసీఆర్ కు ఫిర్యాదు చేశార‌ని సతీష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

5 నెలలైనా త‌మ సమస్యలు పరిస్కారం కావట్లేదని , సీఎస్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమ‌న్నారు. ఉద్యోగాలు పోయి సమాజంలో అవమానాలు ఎదురుకుంటున్నామని, భవిష్యత్ చూపాలని కోరుతున్నామ‌ని అన్నారు. సీఎం మీద నమ్మకం, గౌరవం ఇంకా ఉన్నాయి…మాకు న్యాయం చేయాలనీ కోరుతున్నామ‌ని అన్నారు.

Latest Updates