భూమిని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోంచి తీసేశారని వీఆర్వోను చెప్పులతో కొట్టిన్రు

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: రెండేండ్లు వీఆర్వో చుట్టూ తిరిగినా రికార్డుల్లో ఆ రైతుల భూమిని సరి చేయలేదు. దీంతో తాజా భూ రికార్డుల ప్రక్షాళనలో వాళ్ల భూమి ఎకరా చొప్పున అప్‌‌‌‌డేట్‌‌‌‌ కాలేదు. రైతులు, వాళ్ల కుటుంబీకులు తహసీల్దార్‌‌‌‌ ఆఫీసుకు పోయి అక్కడ వీఆర్వోను విషయం అడిగారు. అతను ‘మీకిష్టమొచ్చింది చేసుకొండి’ అని బెదిరించినట్టు మాట్లాడాడు. దీంతో రైతులతో వచ్చిన మహిళలు.. తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లోనే చెప్పులతో వీఆర్వోను చితకబాదారు. ‘సరి చేయకపోగా మమ్మల్నే తిడతావా’ అంటూ దాడి చేశారు. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా తాంసి తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

మాకు తెల్వకుండా ఎట్ల తొలగిస్తరు?

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన తోకల పెదస్వామి అనే రైతుకు 3.25 ఎకరాల భూమి ఉండగా ఇటీవలి భూ ప్రక్షాళనలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి ఎకరం ల్యాండ్ తొలగించారు. వడ్డాడి గ్రామానికి చెందిన మరో రైతు జంగ చిన్నగంగారాంకు 2.37 ఎకరాలు పట్టా ఉంటే 1.26 ఎకరాలను తొలగించారు. ఇటీవల ఆ రైతులు పత్తి అమ్మేందుకు మార్కెట్‌‌‌‌కు వెళ్లగా భూమిని తొలగించిన విషయం తెలిసింది. మంగళవారం తాంసి తహసీల్దార్ ఆఫీసులో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఆఫీసర్ల మీటింగ్ ఉందని తెలుసుకున్న రైతులు, వారి కుటుంబీకులు మండల కేంద్రానికి చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై కప్పర్ల వీఆర్వోగా పని చేసిన రోహిత్‌‌‌‌ను ప్రశ్నించారు. తమకు తెలియకుండా భూమిని ఎలా తొలగిస్తారని అడిగారు. అతను పొంతనలేని జవాబులు చెప్పి ‘మీకిష్టమైంది చేసుకోండి’ అని బెదిరించినట్టు మాట్లాడటంతో మహిళా రైతులు చెప్పులతో దాడి చేశారు. తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, ఇతర ఆఫీసర్లు చూస్తుండగానే తహాసీల్దార్ ఆఫీసులోనే చితకబాదారు. రెండేండ్లుగా వీఆర్వో చుట్టూ తిరుగుతుంటే సరిచేయకపోగా తమనే తిట్టాడని.. అందుకే వీఆర్వోను చితకబాదినట్లు బాధితులు తహసీల్దార్ సంధ్యారాణికి చెప్పారు. రైతులకు న్యాయం చేస్తామని ఆమె భరోసా ఇవ్వడంతో శాంతించారు.

Latest Updates