పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు..ఆర్డీవో క్లారిటీ

నెల్లూరు: ఈవీఎంల పనితీరుపై ఓవైపు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతుంటే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీప్యాట్‌ స్లిప్పులు భారీగా బయటపడ్డాయి.  అయితే ఇవన్నీ మాక్‌ పోలింగ్‌కు సంబంధించిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్‌ ముత్యాల రాజు  చెప్పారు. నిబంధనల మేరకు ర్యాండమైజేషన్‌ స్లిప్పులను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.  కలెక్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని పాఠశాలకు వచ్చిన ఆర్డీవో బృందానికి చాలా కవర్లలో స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆర్డీవో సమక్షంలోనే సిబ్బంది తగులబెట్టారు.

ఆత్మకూరులో దొరికిన వీవీప్యాట్‌ స్లిప్పులు ఎన్నికల పోలింగ్‌ రోజువి కాదని ఆర్డీవో చిన రాముడు క్లారిటీ ఇచ్చారు. ‘పోలింగ్‌కు ముందు అభ్యర్థుల ముందు వెయ్యి ఓట్లు వేయిస్తారు. సిబ్బందికి శిక్షణలో భాగంగా 5శాతం స్లిప్పులు తీస్తారు. ఆ స్లిప్పులను ఆరోజే ధ్వంసం చేయాలి కానీ  కొన్ని స్లిప్పులను సిబ్బంది పాఠశాల ఆవరణలో వదిలి వెళ్లారు‘  అని చెప్పారు.

Latest Updates