తుపాకీ బుల్లెట్ నుంచి ప్రాణాలు కాపాడిన పర్స్

ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలలో ఇప్పటివరకు పదిహేను మంది పౌరులు మరణించారు. నిరసనకారులను చెదరగొడుతున్న సమయంలో కనీసం 263 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు, వారిలో 57 మంది సిబ్బందికి తుపాకీ గాయాలు అయ్యాయి.

నిరసనలలో భాగంగా ఫిరోజాబాద్‌లో కూడా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులను అదుపుచేస్తున్న పోలీస్ సిబ్బందిపై కొంతమంది నిరసనకారులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కానిస్టేబుల్ విజేంద్ర కుమార్ మరణం అంచుదాకా వెళ్లి తృటిలో తప్పించుకున్నాడు. నిరసనకారులు చేసిన కాల్పుల్లో ఒక బుల్లెట్ విజేంద్ర కుమార్ గుండెకు తాకింది. అయినా కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అదేలాగంటారా.. అతను డ్యూటిలో ఉన్పప్పుడు ఒక జాకెట్ వేసుకొని ఉన్నాడు. ఆ జాకెట్ పై జేబులో తన పర్సును పెట్టుకున్నాడు. ఆ పర్సే అతని ప్రాణాలను కాపాడింది. కాల్పుల్లో అతనికి తగిలిన బుల్లెట్, అతని గుండెలకు తాకకుండా పర్సు అడ్డుపడింది. పర్సును చీల్చకుంటూ బుల్లెట్ సగం వరకు వెళ్లి ఆగిపోయింది. దాంతో అతను మరణం నుంచి తప్పించుకోగలిగాడు. ఆ పర్సే తనకు రెండో జీవితాన్ని ప్రసాదించినట్లు విజేంద్ర అంటున్నాడు.

‘నేను నల్బంద్ ప్రాంతంలో విధుల్లో ఉండగా.. కొంతమంది నిరసనకారులు మాపై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నా జాకెట్‌ను తాకింది. అది నా జాకెట్ జేబులో ఉంచిన వాలెట్లో చిక్కుకుంది. వాలెట్‌లో 4 ఏటీఎం కార్డులు మరియు శివుడు, సాయిబాబాల ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు నాకిది రెండవ జీవితం అనిపిస్తుంది’ అని విజేంద్ర కుమార్ అన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు నల్బంద్ ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. హింసాత్మక నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 705 మందిని అరెస్టు చేయగా, 4,500 మందిని నిర్బంధంలో ఉంచినట్లు రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిరసనకారులు చేసిన కాల్పుల్లో 405 బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. బహ్రాయిచ్, బరేలీ, వారణాసి, భడోహి, గోరఖ్‌పూర్, మరియు సంభాల్‌తో సహా ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో నిరసనల సందర్భంగా ఘర్షణలు జరిగాయి.

For More News..

యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు మరణశిక్ష

Latest Updates