ఇంకో లెవెల్​కు తీసుకెళ్తా: హెడ్‌‌ కోచ్‌‌ రవి శాస్త్రి

అత్యుత్తమ జట్టుగా నిలిపి ఆనందంగా తప్పుకుంటా

కూలిడ్జ్‌‌ (ఆంటిగ్వా): తన పదవీకాలం ముగిసేలోపు టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లి.. అత్యద్భుతమైన జట్టుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ రవి శాస్త్రి తెలిపాడు. వచ్చే రెండేళ్లలో జట్టులో అనేక మార్పులు రానున్నాయని, ఇవన్ని సాఫీగా జరిగే లా చూస్తానని అన్నాడు.  ‘రాబోయే రెండేళ్లలో చాలా మంది కుర్రాళ్లు జట్టులోకి రానున్నారు. ముఖ్యంగా లిమిటెడ్‌‌ ఓవర్ల క్రికెట్‌‌లో వీరి రాక నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ముగ్గురు, నలుగురు కొత్త బౌలర్లను టీమ్‌‌కు అందుబాటులోకి తేవాలి. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఉన్నాయి. నేను పదవి నుంచి దిగిపోయేటప్పటికీ ఇండియా టీమ్​కు ఘన వారసత్వాన్ని అందించాలి. రాబో యే తరాలకు ఈ జట్టు స్పూర్తిగా నిలవాలి. ఆ ఆనందంతో నేను రిటైరవ్వాలి’ అని రవి చెప్పాడు.

తపన కొనసాగుతుంది…

ఎంత ఉత్తమ జట్టు అయినప్పటికీ ప్రతి జట్టులోనూ ఆయా అంశాల్లో మెరుగుపడేందుకు  అవకాశముంటుందని రవి తెలిపాడు. ‘ గత మూడేళ్లుగా టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఎన్నో ప్రమాణాలను నెలకొల్పాం. ఇప్పుడు వాటిన అధిగమించాల్సిన అవసరముంది. మరో మార్గం లేదు. ఇలాంటి ప్రయత్నాలు లేకపోతే  అత్యుత్తమమైన జట్టును రూపొందించలేము. జట్టులోకి యువ ఆటగాళ్లు వచ్చినప్పుడు అనేక కాంబినేషన్లను ప్రయత్నించవచ్చు. ఇక గత ఐదేళ్లుగా మన ఫీల్డింగ్‌‌లో చాలా మెరుగుదల కన్పిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్‌‌ జట్టుగా మన టీమ్‌‌ను రూపొందించేలా కృషి చేస్తా. జట్టులోకి రావాలనుకునే ప్లేయర్‌‌కు అద్భుతమైన ఫీల్డర్‌‌ అవడం తప్పనిసరి.  లిమిటెడ్‌‌ ఓవర్ల క్రికెట్‌‌కిది ఇంకా ముఖ్యం. రాబోయే రోజుల్లో మేమంతా కలిసి ప్రస్తుతమున్న  స్థిరమైన ఆటతీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. జట్టును మరో స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తాం’ అని తెలిపాడు. తనపై మరోసారి నమ్మకముంచి మరోసారి చాన్స్​ ఇచ్చిన సీఏసీకి శాస్ర్తి కృతజ్ఞతలు తెలిపాడు.

Latest Updates