టెర్రరిస్ట్ కొడుకులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగింపు

టెర్రరిస్ట్ కొడుకులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగింపు

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉగ్రవాదులకు ఇన్ఫర్మేషన్ చేరవేయడంతో పాటు ఇతర సహాయం అందిస్తున్న 11 మందిని జమ్ము కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ తొలగించింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సయ్యద్ సలాహుద్దీన్‌ కొడుకులు సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసఫ్ ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వాళ్లతో పాటు మరో తొమ్మిది మంది టెర్రర్ ఫండింగ్ యాక్టివిటీస్‌కు పాల్పడినట్లు తేలడంతో సర్వీస్‌ నుంచి డిస్మిస్ చేశామన్నారు. హవాలా ద్వారా డబ్బు సేకరించి, వాటిని హిజ్బుల్ టెర్రరిస్టులకు అందజేస్తున్నట్లు ఎన్‌ఐఏ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందని చెప్పారు. ఎన్‌ఐఏ రిపోర్ట్ ఆధారంగా టెర్రర్ యాక్టివిటీస్‌ నిరోధానికి నియమించిన కమిటీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సీ) కింద వారిని ఉద్యోగం నుంచి తొలగించిందని వెల్లడించారు. 

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి టెర్రిస్టులకు ఇన్ఫర్మేషన్
మొత్తం 11 మందిలో ఇద్దరు జమ్ము కాశ్మీర్ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఒకడు షేర్ ఏ కశ్మీర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నలుగురు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో, అగ్రికల్చర్, స్కిల్ డెవలప్‌మెంట్, పవర్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఒక్కొక్కడు చొప్పున పని చేస్తున్నారని తెలిపారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఇద్దరు ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్‌ను టెర్రరిస్టులకు అందిస్తున్నారని, వారిలో ఒక కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ షిగాన్ కౌంటర్ ఆపరేషన్ల సమయంలో జవాన్లపైనే కాల్పులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో కొంత మంది టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చారని, మరికొందరు సెక్యూరిటీ ఫోర్సెస్ రవాణా సమాచారం చేరవేస్తున్నారని, ఇంకొందరు ఆయుధాలు, వాహనాలు సరఫరా చేస్తున్నారని తెలిపారు.