
రూల్స్ బ్రేక్‌పై జిల్లా ఆఫీసర్లు సీరియస్
అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్
భయంలో సదాశివపేట గులాబీ లీడర్లు
సదాశివపేట టీఆర్ఎస్ లీడర్లు, మున్సిపల్ ఆఫీసర్ల మధ్య వార్ ముదురుతోంది. సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన కౌన్సిల్ సభ్యులు.. ఉద్యోగుల పట్ల దౌర్జన్యం చేయడాన్ని పైఆఫీసర్లు కూడా తప్పుపట్టారు. ఇక కమిషనర్ స్పందన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయడాన్ని వారు సమర్థిస్తున్నారు. కమిషనర్ కూడా తనదైన శైలిలో ఉన్నతాధికారుల సపోర్ట్‌తో యాక్షన్‌లోకి దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సంగారెడ్డి/సదాశివపేట, వెలుగు: పేట బల్దియా పాలకవర్గం, ఆఫీసర్ల మధ్య కొంతకాలంగా నెలకొన్న విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అక్రమాలను ప్రోత్సహిస్తూ కొందరు కౌన్సిల్ సభ్యులు, ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకురాగా కమిషనర్ స్పందన వాటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కౌన్సిల్ సభ్యులు, ఆఫీసర్ల మధ్య మొన్నటి వరకు కోల్డ్ వార్ నడవగా, ఇటీవల ఈ లొల్లి కాస్త మున్సిపల్ మీటింగ్‌లో రచ్చకెక్కింది. అప్పటి నుంచి పేట కౌన్సిలింగ్ సభ్యులలొల్లి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారమే…
కొత్త మున్సి పల్ యాక్ట్ ప్రకారం సదాశివపేట టౌన్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లపై కమిషనర్ యాక్షన్‌లోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం ఏం చెబుతోంది..? ఒకవేళ ఆ చట్టాన్ ని అనుసరించి చర్యలు తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే పేట టీఆర్ఎస్ లీడర్ల తీరుపై మున్సి పల్ మినిస్టర్ కేటీఆర్ ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకపక్క ఈ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడం.. మరో పక్క కొత్త చట్టం ఎలాంటి ప్రమాదం తెచ్చిపెడుతుందోనని టీఆర్ఎస్ లీడర్లలో గుబులు పుట్టిస్తోంది.
800లకు పైగా అక్రమ కట్టడాలు..
సదాశివపేటలో దాదాపు 800లకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ అప్పటి ఆఫీసర్లపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా యాక్షన్ తీసుకోలేదు. కాగా ప్రస్తుతం కమిషనర్ స్పందన పర్మిషన్ లేని కట్టడాలకు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. వీటిపై 4 రోజుల్లో స్పందించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కట్టడాలపై రెండు రోజుల్లో కూల్చివేతలు స్టార్ట్ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ చర్యలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
టార్గెట్ కమిషనర్..
సదాశివపేట మున్సి పాలిటీలో జరుగుతున్న పరిణామాలపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ గా స్పందన బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలల అవుతోంది. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వల్లే ఆమెను టార్గెట్ చేశారని తెలుస్తోంది. కమిషనర్ పనితీరు కౌన్సిల్ కు నచ్చక కొందరు సభ్యులు బహిరంగంగా దూషించే స్థాయికి చేరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమకు అనుకూలంగా పని చేయడంలే దని కొందరు కీలక నేతలు ఆమెను బదిలీ చేయించే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్లోని నియోజకవర్గ స్థాయి లీడర్ ఒకరు కమిషనర్ తో మాట్లా డే ప్రయత్నం చేయగా ఆమె అందుకు అంగీకరించలేదు సరికదా.. ఆ నాయకుడినే ఆఫీస్ కు రమ్మని పురమాయించి నట్లు తెలిసింది. రూల్స్ పాటించే విషయంలో తన దృష్టిలో అందరూ సమానమే అని కమిషనర్ గట్టిగా చెప్పినట్లు సమాచారం.