వరంగల్‍ మెప్మాలో అవినీతి భాగోతం : నిజమేనని తేల్చేసిన అధికారులు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: వరంగల్‍ మెప్మాలో అవినీతి భాగోతం నిజమని తేలింది. గత నెల 22న వెలుగు దినపత్రిక ఈ స్కాంను బయటపెట్టింది. మెప్మా ఉద్యోగులే పేద మహిళల ఫోటోలు, ఐడీ కార్డులతో నకిలీ గ్రూపులను క్రియేట్‍ చేసి లోన్లు కాజేసిన తీరుపై ‘వరంగల్‍ మెప్మా లో 70 కోట్ల స్కాం’ అన్న కథనం వెలుగులో వచ్చింది. స్కాం ఎలా జరిగింది, అధికారుల ప్రమేయం, స్కాంకు బాధ్యులెవరూ తదితర అన్ని అంశాలను వివరిస్తూ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో జిల్లా ఉన్నతాధికారుల్లో కలకలం మొదలెకాగా, స్కాంతో సంబంధం ఉన్నవాళ్లలో వణుకుపుట్టింది. జిల్లా కలెక్టర్‍ ప్రశాంత్‍ జీవన్‍ పాటిల్‍  ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేపట్టారు. స్కాంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు ప్రారంభించారు.

వరంగల్‍ మెప్మా స్కాం విషయమై వెలుగు కథనాలతో అలర్టయిన ఉన్నతాధికారులు హంటర్ రోడ్డులోని ఇండియన్‍ బ్యాంకు పరిధిలో జరిగిన అవకతవకలపై మొదట విచారణ చేపట్టారు. ఈ ఒక్క బ్యాంకులోనే 11 సెల్ఫ్‌ హెల్ఫ్‌ గ్రూపులకు రూ.45 లక్షల లోన్‍ మంజూరు చేయించినట్లు తెలుసుకున్నారు. దీనికి సూత్రధారిగా భావిస్తున్న అప్పటి కమ్యూనిటీ ఆర్గనైజర్‍ వి.నాగరాజును విధుల నుంచి తొలగించారు. 2013 నుంచి 2015 మధ్యలో జరిగిన ఈ లోన్లకు సర్టిఫికెట్‍ ఇచ్చిన అప్పటి టీఎంసీ రజితారాణికి షోకాజ్‍ నోటీసులు అందజేశారు. స్కాంలో పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు వరంగల్‍  అర్బన్‍ డీఆర్ డీఓను, బ్యాంకు అధికారుల పాత్రపై విచారణ చేసేందుకు ఇండియన్‍ బ్యాంకు జోనల్‍ అధికారిని నియమించినట్లు తెలిపారు కలెక్టర్.

Latest Updates