బతికించుకోవాలన్నా.. శవాన్ని తీసుకు పోవాలన్నా పైసలియ్యాల్సిందే

వరంగల్, వెలుగు: చేతిలో చిల్లిగవ్వ లేక సర్కారు వైద్యం కోసం వస్తున్న నిరుపేదలకు అక్కడా డబ్బుతోనే పని పడుతోంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలుసుకోకుండా సిబ్బంది పైసల్​ డిమాండ్​ చేస్తుండటంతో వైద్యం కోసం వచ్చిన పేషెంట్ల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏ విభాగంలో చూసినా చేతులు తడిపితేనే పని అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వెయ్యి పడకల ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంకు పేదల దవాఖానగా పేరుంది. ఇక్కడి ఉచిత వైద్యాన్ని నమ్ముకుని ఉమ్మడి వరంగల్​తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి నిత్యం వందల మంది వస్తుంటారు. వివిధ వైద్య సేవలు, టెస్టులు, ఆపరేషన్ల కోసం వచ్చేవారితో నిత్యం ఐదారు వందల ఓపీ నమోదవుతోంది. ట్రీట్ మెంట్​పరంగా అన్ని విధాలుగా సౌకర్యంగానే ఉన్నా ఇక్కడి సిబ్బంది తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేషెంట్లు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పేషెంట్​ను జాయిన్​ చేసిన తరువాత శానిటేషన్​ వర్కర్స్​, పేషెంట్​ కేర్​ ప్రొవైడర్లు కేవలం వసూళ్ల మీదనే దృష్టి పెడుతున్నారని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటుకు వెళ్లలేక ఇక్కడికొస్తే..

ప్రైవేటుకు వెళితే ఏ చిన్న రోగానికైనా పెద్దపెద్ద టెస్టులు రాయడం.. ప్రజల జేబులు ఖాళీ అవ్వడం సాధారణమైపోయింది. దీంతో వైద్యం కోసం చాలామంది సర్కారు దవాఖానకు క్యూ కడుతున్నారు.  అయితే ఇక్కడి సిబ్బంది చేసిన సేవలకు రూ.100కు తగ్గకుండా డిమాండ్​ చేస్తుండటంతో రోగుల బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంజీఎంలో  మొత్తం 100 మంది సెక్యూరిటీ, 194 మంది శానిటేషన్​ సిబ్బంది, 100 వరకు పేషెంట్​ కేర్​ ప్రొవైడర్లు పని చేస్తున్నారు. ఇందులో చాలామంది పేషెంట్ల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండానే డబ్బులు డిమాండ్​ చేస్తుండటంతో ఇక్కడ వైద్యమంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

అంబూ పెడితే అంతే..

రోడ్డు ప్రమాదాలు, హార్ట్​ స్ట్రోక్​లు, ఇతర ప్రమాదాల్లో గాయపడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారికి అంబూ(అర్టిఫీషియల్​ మాన్యువల్​బ్రీతింగ్​యూనిట్) ద్వారా ఆక్సిజన్​అందిస్తారు. అంటే పేషెంట్​కు ఆక్సిజన్​మాస్క్​పెట్టి ఒక ఎయిర్​బ్యాగులాంటి దానిని ప్రెస్​ చేస్తూ ఉంటే శ్వాస ఆడుతుందన్న మాట. యాక్సిడెంట్లు జరిగిన బాధితులకు అత్యవసర సమయాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇలా ఎవరికైనా అంబూ పెట్టాల్సి వస్తే అక్కడి సిబ్బంది వచ్చి అడగకపోయినా సహాయపడతారు. ఆ తరువాత వచ్చి ‘చేతులన్నీ పోవంగ పని చేసినం.. మనిషికో వంద ఇవ్వాల్సిందే’ అని పట్టుబడతారు. ఎవరైనా చనిపోయినా కూడా సిబ్బంది వారిని వదలడం లేదు. మృతదేహాన్ని వాహనంలో ఎక్కించేవరకు వారి వెంటే ఉండి తరువాత వారి బంధువులను డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. ప్రాణం పోయినా కూడా సిబ్బంది వదలడం లేదని పేషెంట్​తాలూకు బంధువులు తలలు పట్టుకుంటున్నారు.

దారి చూపినా అంతే..

హాస్పిటల్​లో మొత్తం 104 డిపార్టుమెంట్లు ఉన్నాయి. నిత్యం తిరిగే సిబ్బందికే ఏ డిపార్ట్​మెంటు ఎక్కుడుందో చెప్పమంటే కాసేపు ఆలోచించక తప్పని పరిస్థితి. ఇక కొత్తగా చేరిన పేషెంట్ల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఎక్స్ రే, స్కానింగ్, మెడిసిన్​ మొదలైన వాటికోసం రోగులు తిరగాల్సి వస్తే ఆ పరిస్థితిని కూడా కొంతమంది క్యాష్​ చేసుకుంటున్నారు. అడ్రస్​ చెబుతామంటూ పేషెంట్ బంధువులను తీసుకెళ్లి చూపిస్తారు. తీరా థ్యాంక్స్​ చెప్పేలోపే రూ.100 అడుగుతారు. గత బుధవారం నర్సంపేటకు చెందిన ఓ పేషెంట్​కు ఇదే పరిస్థితి ఎదురైంది. నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు కేవలం నామమాత్రంగా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. గతంలో ఇలాంటి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కొన్నిచోట్ల ‘హాస్పిటల్​ సిబ్బందికి ఎలాంటి లంచాలు ఇవ్వకూడదు’ అని బోర్డులు కూడా పెట్టించారు. అయినా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు.

Latest Updates