తండ్రి అవ్వాలంటే.. ఇవి మానేయాల్సిందే!

మంచి ఫుడ్ తింటే మనిషి అన్ని రకాలుగానూ గట్టిగా ఉంటాడు. కానీ ఇప్పుడు జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం వచ్చి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. చిన్న వయసులోనే షుగర్ లాంటివి వచ్చి.. దీర్ఘకాలిక వ్యాధులతో ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ వల్ల మగవాళ్లపై పెద్ద దెబ్బే పడుతుందని బాంబ్ పేల్చారు అమెరికా శాస్త్రవేత్తలు. ‘నాన్న’ అని పిలిపించుకోవాలన్న కోరిక ఉంటే కుర్రకారు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తింటే టెస్టికల్ సైజు, వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోయి.. సంతాన సాఫల్య శక్తి క్షీణిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

18 నుంచి 20 ఏళ్ల కుర్రాళ్లపై రీసెర్చ్

18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న 2,935 మందిపై అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్లు పరిశోధనలు చేశారు. ఓ మిటలరీ ఎంట్రెన్స్‌ కోసం హాజరైన సందర్భంలో వారందరి ఆరోగ్య స్థితితో పాటు వృషణాల సైజు, వీర్యం కౌంట్, వీర్య కణాల ఆకృతి, వాటి స్విమ్మింగ్ సామర్థ్యం వంటి వాటన్నింటినీ పరిశీలించారు. వారి డైట్‌ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్లు రీసెర్చ్‌ని లీడ్ చేసిన డాక్టర్ ఫైబీ నసాన్ తెలిపారు.

ఏం తినాలి? ఏం తినకూడదు?

  • జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే వీర్యకణాల కౌంట్ తగ్గుతుంది. అలాగే వృషణాల సైజు కూడా చిన్నగానే ఉంటుంది.
  • పిజ్జా, బర్గర్, చిప్స్, రెడ్ మీట్, బ్రెడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటి ఫుడ్స్ అతిగా తింటే మగవాళ్లలో వీర్య కణాల ఉత్పత్తికి తోడ్పడే సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి శాశ్వతంగా దెబ్బతింటుంది.
  • చేపలు, చికెన్, ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు రెగ్యులర్‌గా తీసుకుంటే సంతాన సాఫల్య శక్తి పెరుగుతుంది.
  • బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకుంటే వృషణాల సైజు మంచిగా ఉండడంతో పాటు వీర్య కణాల ఉత్పత్తి బాగుంటుంది.

పూర్తి వెజ్‌టేరియన్స్.. సెకండ్ ప్లేస్

కూరగాయలు, ఫ్రూట్స్‌తో పాటు చేపలు, చికెన్ లాంటివాటితో బ్యాలెన్స్డ్‌ డైట్ తీసుకునే వారికి నాన్న అయ్యే సామర్థ్యం ఎక్కువగా ఉందని డాక్టర్ నసాన్ చెప్పారు. పూర్తిగా వెజిటేరియన్ డైట్ తీసుకునే వారి టెస్టికల్ సైజ్, వీర్య కణాల ఉత్పత్తి సామర్థ్యం సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. జంక్ ఫుడ్ అధికంగా తీసుకునే వాళ్లు లాస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పారామె.

హెల్తీ ఫుడ్ తింటే ఎంత.. లేకుంటే ఎంత?

  • హెల్తీ డైట్ తీసుకునే మగవాళ్లకు వృషణాల సైజు 13.7 ఎంఎల్‌గా ఉంటుంది. ఒకసారి స్పెర్మ్‌లో 16.7 కోట్ల వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి.
  • రోజూ ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునే వారికి 13.1 ఎంఎల్ సైజులో వృషణాలు ఉంటాయి. అలాగే 12.2 కోట్ల వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి.

Latest Updates