జంపన్నవాగులో కొట్టుకుపోయిన చెక్‌‌‌‌ ‌‌‌‌డ్యామ్‌‌‌‌

కట్టి ఏడాది కూడా కాలె..
నాసిరకం పనులతో రూ.4 కోట్లు నీళ్ల పాలు
రైతుల భూముల కోత
అన్నదాతలకు రూ.20 లక్షల నష్టం

జయశంకర్‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి, వెలుగుప్రభుత్వ అధికారులు.. కాంట్రాక్టర్లు రింగ్‌‌‌‌‌‌‌‌అయ్యారు.. తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.. దశాబ్దాల పాటు రైతులకు ఉపయోగపడాల్సిన చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌ నాసిరకంగా కట్టారు. ఇంకేముంది ఏడాది కూడా కాకముందే అది కొట్టుకుపోయింది. దాని కింద భూములు కోతకు గురై రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. మేడారంలో పనులు నాసిర‍కం చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.  మేడారం జాతరలో జంపన్నవాగుకు ప్రత్యేక స్థానం ఉంది. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ఈ వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళతారు. జాతర సమయంలో మోకాలు లోతు నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జంపన్నవాగులో మూడు చోట్ల రూ.12 కోట్లతో మూడు చెక్‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌లు కట్టింది. రెడ్డిగూడెం నుంచి ఊరట్టం వైపు వీటిని నిర్మించారు. 2 కి.మీ పరిధిలోనే మూడు చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌ల నిర్మాణం చేశారు. గత వేసవిలో పనులు చేశారు. నిర్మించి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రూ.4 కోట్లతో కట్టిన చెక్‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌ ఒకటి కొట్టుకుపోయింది.

సీసీకి బదులు మట్టి

జంపన్నవాగులో ఏటా వరద ఎక్కువగా వస్తోంది. ఈ వరదను తట్టుకొని నిలబడేలా చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌ కట్టాలి. అంటే చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌కు అటు.. ఇటు ఒడ్డువైపు సీసీతో గోడ కట్టాలి. ఊరట్టం సమీపంలో కొట్టుకుపోయిన చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌కు కుడివైపు సీసీతో గోడ కట్టిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ఎడమవైపు కేవలం మట్టి పోసి వదిలేశారు. దీంతో ఇటీవలి భారీ వానలతో వచ్చిన వరదకు చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్ కొట్టుకుపోయినట్లు రైతులు చెబుతున్నారు.

కొట్టుకుపోయిన రైతుల భూములు

వరదకు చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌ కొట్టుకుపోవడం వల్ల పెద్దగొయ్యి ఏర్పడింది. దీంతో ప్రక్కనే ఉన్న రైతులకు సంబంధించిన మూడు ఎకరాల భూమి కోతకు గురైంది. దీంతో రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌‌‌‌‌‌‌‌లో వరి వేయడానికి రైతులు నారు పోసి పొలాలు దున్ని రెడీ చేశారు. నాట్లువేసే సమయంలో జంపన్నవాగుకు వరద వచ్చి చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌ కొట్టుకుపోయింది. ఎడమవైపున మట్టి కట్ట ఉండటంతో వరద అంతా పొలాల మీదుగా వెళ్లింది. దీంతో మూడు ఎకరాల భూములు కొట్టుకుపోయినట్లుగా అన్నదాతలు చెప్పారు.

Latest Updates