కేరళలో యూడీఎఫ్ సభ్యుల ఆందోళన

కేరళలో యూడీఎఫ్ సభ్యుల ఆందోళన

బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. యూడీఎఫ్ (UDF) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు మార్చ్ ను నిర్వహించింది. వారు ముందుకు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన యూడీఎఫ్ సభ్యులను నిలువరించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వాటర్ ఫిరంగిలతో వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారు చెదరకుండా అక్కడే బైఠాయించారు. పలు చోట్ల వామపక్షాలకు చెందిన ఫ్లెక్సీలను యూడీఎఫ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కొచ్చిలో మాజీ ఉప ముఖ్యమంత్రి చాందీ నిరసనను ప్రారంభించారు. కార్యకర్తలు బారికేడ్లపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Kasaragod, Pathanamthitta, Kollam ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. 

గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళ సీఎం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న స్వప్నా సురేష్ ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం పినరయి విజయన్ తో పాటు ఆయన సతీమణి, కుమార్తె ఇద్దరు సహాయకులకు ఈ కేసుకు సంబంధం ఉందని ఆరోపించారు. 2020 జులైలో యూఏఈ దౌత్య కార్యాలయానికి చెందిన పార్సిల్ లో రూ. 15 కోట్ల విలువైన బంగారం కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేకేత్తించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పదవి నుంచి తప్పించారు. వస్తున్న ఆరోపణలను సీఎం పినరయి విజయన్ తిప్పికొడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.