తాగడానికి గుహలో ఉన్న నీళ్లే దిక్కు

జావాలోని క్లెపూ ఊర్లో ఇదే పరిస్థితి

ఇండోనేసియాలోని చాలా ఊళ్లలోనూ ఇంతే

అప్పట్లో దక్షిణాఫ్రికాలోని కెప్‌‌‌‌టౌన్‌‌‌‌లో కరువొచ్చింది. ఆ మధ్య లాతూర్‌‌‌‌లో చుక్క నీళ్లు లేక రైళ్లతో నీటిని పంపాల్సి వచ్చింది. మోన్నామధ్యే చెన్నైలో నీటి కటకట కళ్లలో నీళ్లు తెప్పించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పడగవిప్పుతోంది. ఇండోనేసియాలోని చాలా ఊళ్లల్లో ఎండాకాలంలో నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి. జావాలోని గ్రామాల్లోనైతే మరీ ఎక్కువ.

తూర్పు జావా ప్రావిన్స్‌‌‌‌లోని క్లెపూ గ్రామంలో గుహలో నీటిని తాగి బతుకీడుస్తున్నారు. ఎండాకాలంలో క్లెపూలో నీళ్లు దొరకడం కష్టమైపోతోంది. ప్రభుత్వ ట్యాంకర్లు నెలలో రెండు సార్లే వస్తుంటాయి. దీంతో  గుహలో దొరికే నీటినే తోడుకొని వాడుకుంటున్నారు. గుహలోని నీళ్లు శుభ్రంగా ఉంటాయని, అందుకే ఊరి నుంచి కిలోమీటర్‌‌‌‌ దూరమున్నా వెళ్లి తెచ్చుకుంటామని క్లెపూ గ్రామస్థురాలు మిరటిన్‌‌‌‌ అంటున్నారు. తన భర్త ఉన్నప్పుడు బైక్‌‌‌‌పై వెళ్లి నీళ్లు తెచ్చుకుంటామని, లేకపోతే ఒంటరిగానే వెళ్తానని చెబుతున్నారు. తమ ఊరికి నేషనల్‌‌‌‌ వాటర్‌‌‌‌ ఏజెన్సీ నీళ్లు ఇవ్వాలని మిరటిన్‌‌‌‌ కోరుతున్నారు. నెలకు కొంత డబ్బు కట్టమన్నా కడతామని చెప్పారు.

త్వరలో 12 డ్యామ్‌‌‌‌లు

జావా ద్వీపంలో నీళ్లకు కొరత లేదు. కానీ డిమాండ్‌‌‌‌ పెరుగుతుండటం, ఉన్న నీటిని ఎక్కువగా వాడుతుండటంతో కటకట తప్పడం లేదు. 2040 నాటికి జావాలోని ప్రజలకు ప్రస్తుతమున్న తాగు నీటిలో నాలుగో వంతే మిగులుతుందని ఇండోనేసియా సర్కారు చెబుతోంది. అందుకే 2024 నాటికి జావాలో 12 డ్యామ్‌‌‌‌లు కట్టి కోటి మందికి నీటినందిస్తామని వెల్లడించింది.