CWMI రిపోర్ట్ : రాబోయే రోజుల్లో చుక్క నీరు దొరకదంట

మన నగరాలకు రానున్న రోజులు  కష్ట కాలమే. ఈ సిటీల్లో మంచి నీటికి  మనిషి  అల్లాడాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.  కోట్ల మంది ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క నానా ఇబ్బందులు పడే ప్రమాదం కనిపిస్తోంది. చరిత్రలో గతంలో ఎన్నడూ  రానంత రీతిలో ఆరు మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వాటర్ క్రైసిస్‌‌ని ఎదుర్కోబోతున్నాయి. ఈ నగరాలే కాదు, దేశంలోని మరో మరో 15 నగరాల్లో నీటి చుక్కే కనిపించని రోజులోస్తాయట ఇదంతా ఎప్పుడో కాదు. వచ్చే ఏడాదిలోగానే జరుగుతుందని  ‘నీతి ఆయోగ్’ తాజా రిపోర్ట్ వెల్లడించింది  కటకటలాడతారని హెచ్చరించింది. ఈ ప్రమాదం ఇక్కడితో ఆగేట్టు లేదు. 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి గొంతు తడుపుకోవడానికి నీళ్లే దొరకని పరిస్థితి వస్తుందని ‘కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యుఎంఐ)’ రిపోర్ట్ వెల్లడించింది.

ఈ తాజా నివేదిక ప్రకారం నీళ్లకు సంబంధించి దేశం డేంజర్ జోన్‌‌లో ఉంది. ఈ క్రైసిస్ నుంచి బయటపడటానికి సర్కార్ వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. యుద్ధ ప్రాతిపాదికన వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌‌మెంట్‌‌ని పక్కాగా అమలు చేయాలని సూచించింది. మంచినీళ్లు దొరక్కపోవడంతో చాలామంది కలుషిత నీళ్లనే తమకు తెలిసిన పద్ధతిలో శుద్ధి చేసుకుని తాగుతున్నారు. దీంతో ప్రతి ఏడాది రెండు లక్షల మంది కలుషిత నీళ్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అడుగంటిపోతున్న గ్రౌండ్ వాటర్‌‌ని సీడబ్ల్యుఎంఐ సీరియస్‌‌గా తీసుకుంది. గ్రౌండ్ వాటర్‌‌ని అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైన నీళ్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

2002–2016 మధ్య ప్రతి ఏడాది 10 నుంచి 25 మిల్లీ మీటర్ల మేర అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందన్నది మరో  రిపోర్ట్ పేర్కొంది. అండర్ గ్రౌండ్ వాటర్‌‌ని పెంచుకునే పథకాలను వెంటనే అమలు చేయకపోతే ఆ ప్రభావం జీడీపీపై తప్పకుండా పడుతుందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి జీడీపీ ఆరు శాతం తగ్గుతుందని తేల్చి చెప్పింది.

పెరుగుతున్న జనాభా ఓ కారణం

ఏడాదికేడాది పెరుగుతున్న జనాభా కూడా నీళ్ల సమస్య రావడానికి ఓ కారణమవుతోంది. జనాలు పెరగడంతో నీళ్ల వాడకం కూడా పెరుగుతోంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నీటి నిల్వలు పెరగడం లేదు. భూమి లోపల  ఎక్కడైనా కాసిన్ని నీళ్లు  దొరికితే వాటిని కూడా వదలడం లేదు. చుక్క నీరు కూడా మిగల్చకుండా తోడేస్తున్నాం. మన దేశంలో నీటి వాడకంలో వ్యవసాయానిదే టాప్ ప్రయారిటీ. యునిసెఫ్ రిపోర్ట్ ప్రకారం, తొంభై శాతం నీటిని  వ్యవసాయానికే వాడుతున్నారు. ఆరు శాతాన్ని పరిశ్రమలకు, మిగతా నాలుగు శాతం నీటిని ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కాలం గడిచేకొద్దీ, నీటి వాడకంలో లెక్కలు మారాయి. అర్బనైజేషన్, మారుతున్న లైఫ్ స్టయిల్, ఇండస్ట్రియల్ గ్రోత్… ఈ అన్ని కారణాలతో నీటి వాడకం కూడా పెరిగింది. పట్టణాలు, నగరాల్లో నివసించే వాళ్ల  నీటి అవసరాలు గతంలో పోలిస్తే  దాదాపు పది శాతం పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌‌గఢ్, తమిళనాడు సహా ఇప్పటికే అనేక రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రం అవుతుందని వాటర్ కన్సర్వేషన్‌‌కి సంబంధించిన సర్వే తెలిపింది. భూగర్భ జలాలు ఖాళీ అయిపోవడంతో ఆ ప్రభావం సగటు వర్షపాతంపై పుడుతోంది. ఫలితంగా వానలు పడే రోజులు తగ్గిపోయాయి. నీళ్ల సమస్య ను ఒక్కో రాష్ట్రం ఒక్కోలా డీల్ చేస్తుంది. ఆయా స్థానిక పరిస్థితులకు తగ్గట్టు సమస్యను పరిష్కరించుకుంటుంది. అందుకు అనుగుణంగా పక్కా ప్లాన్లు రూపొందించుకుంటుంది. ఈ ప్రక్రియనే టెక్నికల్ గా ‘వాటర్ ఇండెక్స్ స్కోర్’ అంటారు. ఎక్కువ రాష్ట్రాలు ఈ వాటర్ ఇండెక్స్ స్కోర్‌‌లో వెనకబడి ఉన్నాయి. పక్కా ప్లానింగ్‌‌తో ముందుకెళితే వాటర్ రిసోర్సెస్‌‌ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

నీళ్ల సమస్య కు కాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది. దీని ప్రభావం ముందుగా  వ్యవసాయంపైన, ఆ తర్వాత  పంట దిగుబడిపైన పడుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఈ అన్ని కారణాలతో  ఫుడ్ సెక్యూరిటీ రిస్క్‌‌లో పడిందని నివేదిక వెల్లడించింది. అయితే కొన్ని రాష్ట్రాలు వాటర్ ఇండెక్స్ స్కోర్‌‌లో మంచి పాయింట్లే సాధించాయి. కొన్నేళ్ల కిందటి వరకు తీవ్ర నీటి ఎద్దడికి గురైన దాదాపు 15 రాష్ట్రాలు 2016–17లో జల వనరులు పెంచుకున్నాయి.

నీళ్లడిగితే సంకెళ్లు!

జనం మంచినీళ్లకోసం అరెస్టు కావడం ఈ వేసవిలో జరిగిన విడ్డూరం. రుతుపవనాల రాక ఆలస్యం కావడంవల్ల, అప్పటికే అండర్‌గ్రౌండ్‌ అడుగంటిపోవడంవల్ల తమిళనాడు ప్రజలు వాడకంనీళ్లకు సైతం ఇబ్బందులు పడ్డారు. ఈ వారంలోనే చెన్నై, కోయంబత్తూరుల్లో నీటి ధర్నాలు జరిగాయి. దాదాపు 550 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోనే ఆరో పెద్ద నగరమైన చెన్నైకి నీటిని అందించే నాలుగు రిజర్వాయర్లలో నీళ్లు లేకుండా పోయాయి. డెడ్‌ స్టోరేజీకి రావడంతో సరఫరా బంద్‌ చేశారు. గత ఏడాది జూన్‌ నెలలో నిండుగా కనిపించిన పుళల్‌ సరస్సు ఏడాది తిరిగేసరికి ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది.  చెంబరంబాకం రిజర్వాయర్‌ ఒకదానిలోనే కాస్తో కూస్తో నీళ్లు మిగిలున్నాయి. పోయినేడాది డిసెంబర్‌ తర్వాత చెన్నై నగరంలో చిరుజల్లయినా కురవకపోవడంవల్లనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. పొద్దున ఒక గంట, రాత్రికి ఒక గంట చొప్పున నీళ్లను వదులుతుంటే, దానికోసం కొట్లాటలు జరుగుతున్నాయి. నగరంలో వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌ సరిగ్గా లేకపోవడంవల్ల ఎక్కడా నీళ్లు ఇంకడానికి అవకాశం లేదు. తమిళనాడులోని నదుల్లోనూ, కాలువల్లోనూ పూడికను ఎప్పటికప్పుడు తీసినట్లయితే భూగర్భంలోకి ఇంకడానికి ఛాన్స్‌ ఉంటుందని, పై పొర మొత్తం చౌడు బారినందున ఇంకడం లేదని చెబుతున్నారు.  చెన్నైలో మురికివాడల్లో నివసించే జనాల పరిస్థితి చెప్పడానికి మాటలు చాలవు. పనిపాటలు మానుకుని బిందెలతో పడిగాపులు కాస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు.  ఇక్కడి స్లమ్‌ ఏరియాల్లో దాదాపు 9లక్షల మంది ఉంటున్నట్లు అంచనా. స్వల్పాదాయ కుటుంబాలవారు ఇంకుడు గుంతల జోలికి వెళ్లడం లేదు. అలాగని, ప్రైవేటు ట్యాంకర్లను కొనడానికికూడా స్తోమత ఉండడం లేదు.

గుజరాత్‌‌ భేష్‌‌

నీళ్లనేవి పూర్తిగా స్టేట్ సబ్జెక్ట్. దీంతో నీళ్లకు సంబంధించిన అన్ని అంశాలపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలంటారు నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్.  దేశవ్యాప్తంగా మొత్తం 14  రాష్ట్రాలు వాటర్ మేనేజ్‌‌మెంట్‌‌లో చాలా పూర్‌‌గా ఉన్నాయని స్పష్టం చేసింది నీతి ఆయోగ్.  వాటర్ మేనేజ్‌‌మెంట్‌‌లో గుజరాత్‌‌కి మంచి మార్కులు వేసింది. 76 శాతంతో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. 69 శాతం స్కోరుతో మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్‌‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానం ఆంధ్ర ప్రదేశ్‌‌ది.

వాటర్‌ ఎమర్జెన్సీ తప్పదా?

మహారాష్ట్రలో మహా ఎద్దడి

మహారాష్ట్రలో నీటికి మహా ఇబ్బందవుతోంది. ప్రజలకు నీటి చుక్కల బదులు నింగి చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కరువు నెలకొనటంతో నదులన్నీ ఎండిపోయాయి. డ్యామ్​లు, రిజర్వాయర్లు నీళ్లు లేక నెర్రలిచ్చాయి. ఇక గ్రౌండ్​ వాటరే దిక్కన్నట్లు పరిస్థితి తయారైంది. రుతుపవనాలు రాకపోవటం, వానలు కురవకపోవటంతో జలాశయాల్లోకి నీరు చేరే మార్గం కనిపించట్లేదు. ఫలితంగా ప్రభుత్వం వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి వస్తోంది. రాష్ట్రం మొత్తం మీద 16 ,000 పల్లెల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. 17 రిజర్వాయర్లలో ఐదు చోట్ల వాటర్​ స్టోరేజీ లెవల్​ సున్నాగా నమోదైంది.

అడ్డదిడ్డం కాలనీలే బెంగళూరుకి శాపం

బెంగళూరు నగరానికి దాహం తీర్చేవి కావేరీ నీళ్లే. నగరంలోని మూడింటా రెండొంతుల ప్రాంతానికి కావేరీ నది నుంచి మంచినీళ్ల సరఫరా జరుగుతోంది. సిటీ ప్లానింగ్‌‌ సక్రమంగా లేకపోవడంవల్ల అనాథరైజ్‌‌డ్‌‌ కాలనీలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నాయి. వీళ్లందరూ ట్యాంకర్లపైనా, బోరుబావులపైనే ఆధారపడి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.  1951లో అంటే సుమారుగా 70 ఏళ్ల క్రితం ఒక్కొక్కరికి రోజుకు 14,180 లీటర్ల మేర మంచినీళ్లు అందివ్వగా, యాభై ఏళ్లు తిరిగేసరికి (2001 నాటికి) 5,120 లీటర్లకు తలసరి నీటి సరఫరా పడిపోయింది.  వచ్చే ఆరేళ్లలో 3,670 లీటర్లకు మించి మంచినీళ్లను ఇవ్వలేని పరిస్థితి ఎదురు కానుంది.  ఇప్పటి పరిస్థితిని చూస్తుంటే… మరో ఏడాదిలో దేశంలోని 21 నగరాల్లో గ్రౌండ్‌‌వాటర్‌‌ జీరో లెవెల్‌‌కి పడిపోతుందని, 54 శాతం మేర బావులన్నీ ఎండిపోతాయని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి.  బెంగళూరులో నీటి సమస్యపై పనిచేస్తున్న ఎక్స్‌‌పర్ట్‌‌లు ‘వాటర్‌‌ సెక్యూరిటీ సమాఖ్య’గా ఏర్పడ్డారు. వాళ్ల ఉద్దేశం ప్రకారం నగరంలో వాటర్‌‌ ఎమర్జెన్సీ ప్రకటించక తప్పేలా లేదు. ‘ఇప్పటికే నగరంలోని కొన్ని ఏరియాల్లో వాటర్‌‌ బిడ్డింగ్‌‌ జరుగుతోంది. బోరు బావుల్ని 1500 అడుగుల కిందకు రిగ్గింగ్‌‌ చేస్తున్నా నీరు పడడం లేదు.  ఇదంతా వాటర్‌‌ ఎమర్జెన్సీకి దారి తీయక తప్పదు’ అని వాటర్‌‌ సెక్యూరిటీ గ్రూప్‌‌ కో–ఫౌండర్‌‌ అనిరుద్ధన్‌‌ అన్నారు. నగరానికి నీళ్లు అందించే చెరువుల్ని రియల్​ఎస్టేట్ వ్యాపారులు పూడ్చేసి ప్లాట్లుగా అమ్మేసుకోవడంకూడా ఒక సమస్య.

లీకేజీలతో తల్లడిల్లే ఢిల్లీ

డీజేబీ లెక్కల ప్రకారం జాతీయ రాజధానిలో 88 శాతం వాటర్​ నదుల నుంచే సప్లై అవుతోంది. కానీ అందులో సగం నీళ్లు లీకేజీ వల్ల చివరి ప్రాంతాలకు చేరట్లేదు. ఫలితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వచ స్లమ్​ ఏరియాల్లోని పేదలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇది గ్రౌండ్​ వాటర్​ను ఎక్కువగా వాడటానికి దారితీస్తోంది. ప్రధానంగా ఢిల్లీలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అందువల్ల సర్ఫేస్​ వాటరే సమస్యకు పరిష్కారం కాదని ఎన్​జీఆర్​ఐ డైరెక్టర్​ డాక్టర్​ వీఎం తివారీ అభిప్రాయపడ్డారు.

భద్రం భద్రమన్నారు రాష్ట్రపతి 

నీటి కరువు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. సాక్షాత్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కొత్త లోక్​సభలో  చేసిన ప్రసంగంలో వాటర్​ షార్టేజీ గురించి మాట్లాడారు. ‘భవిష్యత్​ తరాల కోసం మనం ఇప్పటి నుంచే నీటి ఆదాపై దృష్టి పెట్టాలి.  మన పిల్లల కోసం, రేపటి తరాలకోసం వాటర్ సేవింగ్​ లక్ష్యంతో పనిచేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా జల్ ​శక్తి పేరిట మినిస్ట్రీని ఏర్పాటుచేయటం ఇందులో భాగమే’ అని చెప్పారు. దేశంలో నీటి ఎద్దడి​​ భయంకరంగా మారిందని నీతి ఆయోగ్​ ఈ నెల 14న విడుదల చేసిన రిపోర్ట్​లో చెప్పింది. ఈ  నేపథ్యంలో రాష్ట్రపతి నీటి సమస్యను ప్రస్తావించటంతో ప్రాధాన్యత ఏర్పడింది. అరవై శాతం దేశ జనాభా నీళ్లు లేక నానా యాతనలు పడుతున్నారని, ప్యూరిఫైడ్‌ వాటర్​ అందక ఏటా దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని నీతి ఆయోగ్ ఆవేదన వెలిబుచ్చింది. 2030 నాటికి ఇప్పుడు ఉన్న నీటికి రెండింతల డిమాండ్‌ అవసరమవుతుందని అంచనా వేసింది.

Latest Updates